ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం నాడు విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షలను ఈ ఏడాది ఆగష్టు 19,20, 23,24 ,25 తేదీల్లో నిర్వహించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం నాడు ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఎంసెట్ ను ఏపీఈఏపీసెట్ గా ప్రభుత్వం మార్చింది. ఈ నెల 14న అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థుల ర్యాంకులను ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.
మెడిసిన్ విభాగంలో జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఏపీ ప్రభుత్వం ఈ దఫా మాత్రం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించింది. దీనికి ఏపీఈఏపీసెట్ గా పేరు పెట్టింది.ఈ ఏడాది 120 కేంద్రాల్లో ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు.ఇంజనీరింగ్ విభాగంలో 1,34,205 మంది ఉత్తీర్ణత సాధించారు.
80.62 శాతం ఉత్తీర్ణత సాధించినట్టుగా మంత్రి సురేష్ చెప్పారు. అగ్రికల్చర్, ఇంజనీరింగ్,ఫార్మసీ ప్రవేశాలకు 83,822 మంది ధరఖాస్తు చేసుకొన్నారు. 78,066 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,76,603 మంది ధరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో 1,66,460 మంది హాజరయ్యారు.అనంతపురం జిల్లాకు చెందిన నిఖిల్ కు ఫస్ట్ ర్యాంకు దక్కింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహంతనాయుడికి సెకండ్ ర్యాంకు వచ్చింది.వెంకట హనీష్(కడప),. సాయి (విజయనగరం) లకు మూడో ర్యాంకు దక్కింది. ఇంజనీరింగ్ ఫలితాల్లో మొదటి పది ర్యాంకుల్లో అమ్మాయిలకు చోటు దక్కలేదు.రేపటి నుండి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. తొలుత ఇంజనీరింగ్ ఆ తర్వాత అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలు నిర్వహించనున్నట్టుగా మంత్రి వివరించారు.
గత ఏడాది నిర్వహించిన పరీక్షల్లో ఇంజనీరింగ్ విభాగంలో వావిపల్లి సాయినాథ్ ప్రథమ ర్యాంకు సాధించారు. ఆ తర్వాతి స్థానంలో కుమార్ సత్యం, గంగుల భవానీ రెడ్డి ర్యాంకులు పొందారు. 2020లో 1.33,066 లక్షల మంది అర్హత సాధించారు. 1.56 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.