కరెన్సీతో కరోనా వైరస్ వ్యాప్తి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇదీ...

By telugu teamFirst Published Apr 16, 2020, 8:03 AM IST
Highlights
కరెన్సీతో కరోనా వైరస్ వ్యాపిస్తుందనే వార్తలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. కరెన్సీని ఒకరి నుంచి ఒకరు మార్చుకోవడం ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అమరావతి: కరెన్సీ ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందనే వార్తలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. కరెన్సీ మార్పిడి వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటి వరకు ఏ విధంగానూ నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేసారు. 

కరోనా వ్యాప్తి చెందకుండా రెండు వారాల పాటు కరెన్సీ వాడకాన్ని తగ్గించాలంటూ పోలీసు శాఖ ప్రకటన జారీ చేసినట్లు వచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. కరోనా ప్రభావంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిజానిజాలను వెల్లడించేందుకు సీఐడీ సైబర్ సెల్ ను సమాయత్తం చేసినట్లు ఆయన తెలిపారు. 

అసత్య ప్రచారాలు సమాజంలోకి వేగంగా విస్తరిస్తున్నాయని ఆనయ అన్నారు. వాటిని సృష్టించి వ్యాపింపజేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు సందేశాలు పంపించేవారు తప్పించుకుకోలేరని, జైలుకు పంపించి తీరుతామని ఆయన అన్నారు. 

ఇరవై ఐదు రోజులుగా ఇళ్లలో ఉండి ప్రజలు సహకరించారని, ఇప్పుడు అక్కడక్కడ బయటకు వచ్చి పోలీసులతో వాదిస్తున్నారని, రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నవారితో అలా మాట్లాడవద్దని సవాంగ్ అన్నారు. మనందరి కోసమే ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని చెప్పారు. మరికొన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ సహకరించాలని, లాక్ డౌన్ ను ఉల్లంఘించి దాన్ని పొడగించే పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన అన్నారు. 

మరో 18 రోజులు లాక్ డౌన్ పొడగించడంతో అత్యవసర ప్రయాణాలకు పాస్ లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే తప్పుడు సమాచారం ఇచ్చి పాస్ లు తీసుకుంటే చర్యలు తప్పవని ఆయన అన్నారు. 
click me!