నిన్న నటిగా, నేడు డ్యాన్సర్ గా: స్టెప్పులేసిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

By Nagaraju penumalaFirst Published Oct 29, 2019, 8:21 PM IST
Highlights

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విద్యార్థినులతో కలిసి నృత్యం చేశారు. ఒక పదినిమిషాలపాటు నృత్యం చేసి విద్యార్థుల్లో ఆనందం నింపారు. డిప్యూటీ సీఎంతోపాటు పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మీ సైతం మంత్రికి తోడుగా కాలు కదిపారు. 
 

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి చిందేశారు. మంగళవారం విశాఖపట్నం జిల్లా మధురవాడ లోని మారికవలసలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను ఆమె సందర్శించారు. 

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సైన్స్ ఎగ్జిబిషన్ ను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రారంభించారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు నృత్యప్రదర్శనతో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణికి ఇతర అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థినులు డిప్యూటీ సీఎంను డ్యాన్స్ చేయాల్సిందిగా పట్టుబట్టారు. 

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విద్యార్థినులతో కలిసి నృత్యం చేశారు. ఒక పదినిమిషాలపాటు నృత్యం చేసి విద్యార్థుల్లో ఆనందం నింపారు. డిప్యూటీ సీఎంతోపాటు పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మీ సైతం మంత్రికి తోడుగా కాలు కదిపారు. 

సంగీతానికి తగ్గట్లుగా స్టెప్పులు వేస్తూ పాముల పుష్పశ్రీవాణి అదరహో అనిపించారు. పుష్పశ్రీవాణి స్టెప్పులేస్తున్నంత సేపు విద్యార్థులు విజిల్స్ మోత మోగించారు. ప్రజాప్రతినిధులు సైతం తమదైన శైలిలో కాలుకదిపారు. 

అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించారు. ఎగ్జిబిషన్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఒకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాలకు చెందిన వివిధ గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు.  

గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ విజ్ఞాన వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడం వారి సాంకేతికత, నైపుణ్యత ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది విద్యార్థులు 308 రకాల నమూనాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారని తెలిపారు. 

ఈ ప్రదర్శన వారి ప్రతిభకు అద్దం పట్టిందని గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు అందరూ మంచి నైపుణ్యత ఉపయోగించడమే కాకుండా విద్య లో కూడా ప్రధాన స్థానంలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. 

విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరిస్తుందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. 

ఏపీ డిప్యూటీ సీఎంగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పాముల పుష్పశ్రీవాణి గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలల్లో సందడి చేస్తున్నారు. తాను ఒక గిరిజన మహిళ కావడంతో గిరిజనులతో కలిసి సందడి చేస్తున్నారు. 

ఇకపోతే ఇటీవలే దీపావళి ఉత్సవాలను కూడా కుటుంబ సభ్యులతో కాకుండా గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలల్లో గడుపుకున్నారు. విద్యార్థులతో కలిసి క్రేకర్స్ అంటించారు. అక్కడ నుంచి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.   

ఇకపోతే ఇటీవలే రైతులకు సంబంధించి ఒక సినిమాలో కూడా నటించారు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకతపై తెలియజేస్తూ ఒక కీలక సన్నివేశంలో నటించారు. ఉపాధ్యాయురాలిగా ఆ సినిమాలో అవతారం ఎత్తారు పుష్పశ్రీవాణి. 

"

 

click me!