ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు.. అధికారులతో సీఎస్ సమీక్ష

Siva Kodati |  
Published : Apr 08, 2022, 04:01 PM IST
ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు.. అధికారులతో సీఎస్ సమీక్ష

సారాంశం

కొత్త మంత్రుల ప్రమాణ  స్వీకార కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం సీఎస్ సమీర్ శర్మ పలు శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.   

ఈనెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి (ap new cabinet ministers swearing) ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ (ap cs sameer sharma) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ.. నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రులతో కలిసి నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు పొటోకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్, సమాచారశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అంతకుముందు ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) ఆర్ .ముత్యాలరాజు మాట్లాడుతూ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక, అలంకరణ, ఆహ్వాన పత్రిక, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులుగా డిజిగ్నేట్ కాబడిన వారికి ఆహ్వానం పలకడం వంటి ఏర్పాట్లు, వారికి తగిన రవాణా సౌకర్యం వంటివి కల్పిస్తామన్నారు . ఇందుకుగాను ప్రోటోకాల్ డైరెక్టర్ కు సహకరించేందుకు కొంతమంది అధికారులను నియమిస్తున్నట్టు ముత్యాల రాజు.. సీఎస్ కు వివరించారు.

అదనపు డిజి (శాంతి భద్రతలు) రవిశంకర్ మాట్లాడుతూ ... నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని 11వ తేదీన కరకట్ట రోడ్డును రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు, మంత్రులుగా నియమించబడిన వారికి, ఎంపి, ఎంఎల్సి, ఎంఎల్ఏలు వంటి ప్రముఖుల వాహనాలు వేదిక వద్దకు చేరుకునేలా కేటాయిస్తామన్నారు. మిగిలిన వారి వాహనాలు ఇతర మార్గాల్లో వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈసమావేశంలో డిఐజిలు సి. త్రివిక్రమ వర్మ, రాజశేఖర్, సమాచారశాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు కలక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu
Pemmasani Chandrasekhar Powerful Speech: Atal Bihari Vajpayee 101st Jayanthi | Asianet News Telugu