
నంద్యాల: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) నంద్యాల సభలో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu), జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ (pawan kalyan) పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీచేసేందకు సిద్దమవుతున్నాయంటూ... దీంతో రాజకీయ సమీకరణలు కూడా మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా స్పందించిన సీఎం జగన్... ఎంతమంది కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే సీఎం వ్యాఖ్యలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అదే స్థాయిలో సోషల్ మీడియా వేదికన కౌంటరిచ్చారు.
''గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్... ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం'' అంటూ లోకేష్ ఎద్దేవా చేసారు.
జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రెండో విడత డబ్బులను కూడా జమచేసింది వైసిపి ప్రభుత్వం. ఇవాళ(శుక్రవారం) నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యాక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఒక్క బటన్ నొక్కి 10,68,150మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేసారు.
ఈ సందర్భంగా నంద్యాల వేదికగా సీఎం మాట్లాడుతూ... వైసిపి ప్రభుత్వంతో పాటు తనను టార్గెట్ గా చేసుకుని కొందరు ఏకమవుతున్నారంటూ పరోక్షంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. అయితే ఎంతమంది కలిసినా కనీసం తన వెంట్రుక కూడా పీకలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
''దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండటం ఈ రాష్ట్రం చేసుకొన్న ఖర్మ. కానీ ఆ దేవుడు, ప్రజల చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానానికి వచ్చాను... కాబట్టి ఇలా వైసిపి ప్రభుత్వాన్ని, తనను టార్గెట్ చేసి ఎంతమంది కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరు'' అని సీఎం జగన్ అన్నారు.
ఇదిలావుంటే పేదరికం కారణంగా విద్యార్ధుల చదువులు ఆగిపోకూడదని తమ ప్రభుత్వం జగనన్న విద్యా, వసతి దీవెన పథకాలను తీసుకొచ్చిందని జగన్ పేర్కొన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చినట్టుగా సీఎం జగన్ చెప్పారు. విద్యార్ధుల చదువుల కోసం పిల్లల తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా ఉండాలనేది తమ అభిమతమన్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అని సీఎం జగన్ చెప్పారు.
విద్యార్ధుల చదువుల కోసం పూర్తి స్థాయి ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను అందిస్తున్నామన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేద విద్యార్ధుల చదువు కోసం ఒక్క అడుగు ముందుకు వేశారన్నారు. కానీ తాను మాత్రం వైఎస్సార్ కొడుకుగా తన తండ్రి కంటే మరో రెండు అడుగులు వేస్తున్నానని చెప్పారు.
.