రేపు హైదరాబాద్‌‌కు వైఎస్ జగన్.. కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఏపీ సీఎం..

By Sumanth KanukulaFirst Published Nov 15, 2022, 4:27 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఉదయం హైదరాబాద్‌కు రానున్నారు. రేపు హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించనున్నారు. 

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించనున్నారు. బుధవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్‌‌కు రానున్నారు. హైదరాబాద్‌కు చేరకుని కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. అలాగే కృష్ణ కుటుంబ సభ్యులను సీఎం  జగన్ పరామర్శించనున్నారు. సీఎం జగన్‌తో పాటు పలువురు ఏపీ మంత్రులు కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. 

ఇక, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణ మృతిపై సీఎం జగన్ ఇప్పటికే సంతాపం తెలిపారు. ‘‘కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉంటే.. నానక్‌రామ్‌గూడలోని  నివాసంలో కృష్ణ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు  కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కల్యాణ్, రాఘవేంద్ర  రావు, వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, అల్లు అర్జున్, నాగ చైతన్య.. తదితరులు నివాళులర్పించారు.

ఇక, సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకన్న కేసీఆర్.. ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ప్రముఖల సందర్శన కోసం కృష్ణ భౌతికకాయాన్ని నానక్‌రామ్‌గూడలోని నివాసంలోనే ఉంచారు. ఈ రోజు సాయంత్రం అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయం తరలించనున్నారు. సాయంత్రం నుంచి కృష్ణ భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక, బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు కృష్ణ భౌతికకాయాన్ని తరలించనున్నారు. అక్కడ కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. 

click me!