
రేపు తిరుపతిలో (tirupati) పర్యటించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) . గురువారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు సీఎం. 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వీ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అనంతరం 11.20 గంటలకు ఎస్‌వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని ‘జగనన్న విద్యాదీవెన’ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించి .. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
ఆ తర్వాత 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి (sri padmavathi children's hospital) చేరుకుంటారు. అక్కడ టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి టాటా కేన్సర్ కేర్ సెంటర్ (శ్రీ వెంకటేశ్వర ఇన్ట్సిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ హాస్పిటల్)కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2.25 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
రాష్ట్ర విభజనకు ముందు పిల్లల కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రి విధులు నిర్వర్తించింది. అయితే విభజన తర్వాత చిన్నారుల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆస్పత్రి లేని లోటు కనిపిస్తోంది. సూపర్‌స్పెషాల్టీ సేవల కోసం ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే సమగ్ర చికిత్సల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్.జగన్.
అత్యాధునిక ఆస్పత్రుల్లోని సేవలు పేద కుటుంబాల్లోని చిన్నారులకూ అందాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. దీనికోసం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో చిన్నపిల్లల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఆస్పత్రుల్లో వైద్య విద్యార్థులకు, పీజీ వైద్య విద్యార్థులకు శిక్షణ, పరిజ్ఞానం పెంపు కార్యక్రమాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు జగన్. ఈ ఆస్పత్రుల్లో రెండు, మూడేళ్లలో సూపర్ స్పెషాల్టీ పీడియాట్రిక్ కోర్సులను ప్రవేశపెట్టే దిశగా కార్యాచరణ రూపొందించారు.
స్టాఫ్ నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి, ఇతర వైద్య సిబ్బందికి పరిజ్ఞానం బదిలీ చేయడంతోపాటు మంచి శిక్షణ కూడా ఇచ్చేదిశగా ఆస్పత్రులను నిర్మించనుంది ఏపీ ప్రభుత్వం. మొదటగా ఒక్కో ఆస్పత్రిలో 200 బెడ్ల స్థాయిలో చిన్నారులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని నిర్ణయించగా.. తర్వాత 500 బెడ్ల స్థాయికి పెంచారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ తదితర రంగాల్లో చిన్నారులకు సేవలు అందించనున్నాయి ఆస్పత్రులు. మొత్తం 17 విభాగాలను ఒక్కో ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనుంది. వీటిలో అత్యాధునిక లాబొరొటరీ, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ విభాగాలను నెలకొల్పనున్నారు. 2 నుంచి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రులను నిర్మించనున్నారు. ఒక్కో ఆస్పత్రి కోసం రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లను ఖర్చుచేయనుంది ఏపీ ప్రభుత్వం.