జగన్ వద్దకు గన్నవరం, బందర్ పంచాయతీలు... లైన్ దాటితే చర్యలు తప్పవు: నేతలకు సీఎం హెచ్చరిక

By Siva KodatiFirst Published Jun 13, 2022, 5:30 PM IST
Highlights

కృష్ణా జిల్లాలో గన్నవరం, మచిలీపట్నంలలో వైసీపీ నేతల మధ్య విభేదాల వ్యవహారం పార్టీ అధినేత, సీఎం జగన్ వరకు వెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. పార్టీ లైన్ దాటితే సహించేది లేదని మండిపడ్డారు. 

కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, గన్నవరంలలో (Gannavaram) వైసీపీ నేతల మధ్య పంచాయతీలు పార్టీ అధినేత, సీఎం జగన్ (ys jagan) దాకా చేరుకున్నాయి. పార్టీ లైన్‌కు అందరూ కట్టుబడి పనిచేయాలంటూ నేతలను జగన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వరూ రోడ్డెక్కినా చర్చలు తప్పవని హెచ్చరించినట్లుగా సమాచారం. సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) .. కృష్ణాజిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్‌లు (marri rajasekhar) రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా గన్నవరం వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్ రెడ్డిని పిలిపించి మాట్లాడారు. గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు వల్లభనేని వంశీ చూసుకుంటారని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేయాల్సిందేనని ఆదేశించినట్లుగా సమాచారం. 

అటు మచిలీపట్నంలో (machilipatnam) ఎంపీ బాలశౌరి (vallabhaneni balashowry) , మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని (perni nani) మధ్య చెలరేగిన వివాదంపై వైసీపీ (ysrcp) అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి తప్పితే ఇలా మీడియాకెక్కి రచ్చకెక్కడం సరికాదని, మౌనంగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఎంపీని అడ్డగించడం, గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడాన్ని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇద్దరినీ తాడేపల్లికి పిలిపించి మాట్లాడతారనే చర్చ నడుస్తోంది. ఇటీవల బందరులో శ్మశానవాటిక పరిశీలనకు వెళ్లిన ఎంపీ బాలశౌరికి ఎమ్మెల్యే పేర్ని నాని అనుచరులు, కార్పొరేటర్ అస్ఘర్ అలీ, సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

మరోవైపు.. తనను అడ్డుకున్న వారిపై బాలశౌరి కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘బందరు ఏమైనా నీ అడ్డానా?’ అంటూ మీడియా ముఖంగా పేర్ని నానిపై విరుచుకుపడ్డారు. పేర్ని నాని తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆరోపించారు. టీడీపీ నేత కొనకళ్లతో అధికార పార్టీ ఎమ్మెల్యే పనేంటీ అని ఎంపీ నిలదీశారు. వైసీపీ ఏదారి పడుతోందో ప్రజలకే అర్ధం కావడం లేదంటూ బాలశౌరి అన్నారు. 

ఇకపై బందరులోనే ఉంటానని.. ఎవరేం చేస్తారో చూస్తానంటూ ఎంపీ హెచ్చరించారు. తాటాకు చప్పుళ్లకు, ఊడుత ఊపుళ్లకు భయపడేది లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంను విమర్శించిన కార్యక్రమంలో పేర్ని నాని ఎందుకు పాల్గొన్నారని బాలశౌరీ ప్రశ్నించారు. సుజనా చౌదరి, పేర్ని నాని ఒకరినొకరు పొగుడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.  అంతేకాదు, నాని సెటిల్‌మెంట్లు కూడా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో బందరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అంతేకాదు, లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జరిగే ఏ కార్యక్రమానికి ఎంపీకి ఆహ్వానం అందడం లేదని కూడా బాలశౌరి అనుచరులు చెబుతున్నారు. ఇటీవల బందరు హార్బర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు కేంద్ర సహాయ మంత్రి వచ్చారు. ఆ కార్యక్రమంలో బాలశౌరి, పేర్ని నాని పాల్గొన్నప్పటికీ అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు.

మరోవైపు, పేర్ని నానిపై బాలశౌరి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం.. మీడియాకెక్కడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు, నిన్న బందరులో పర్యటించిన బాలశౌరిని నానితో వివాదంపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరారు. దీనికి ఆయన మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ముక్తసరిగా జవాబిచ్చారు. అధిష్టానం నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. మరోవైపు, పేర్ని నాని కూడా ఈ ఘటనపై ఇలాంటి సమాధానమే ఇచ్చారు. తన ఆరోగ్యం బాగాలేదని, ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు.

click me!