తన మూడేళ్ల పాలనను చూసిన చంద్రబాబు కుప్పానికి పరిగెత్తాడని ఏపీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు కుప్పం పర్యటనపై జగన్ విమర్శలు చేశారు.
కోనసీమ: తన మూడేళ్ల పాలనను చూసిన Chandrababu కుప్పానికి పరిగెత్తి ఇల్లు కట్టుకుంటున్నాడని ఏపీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు వేశారు.
Konaseema జిల్లాలోని పోలవరం మండలం మూరమళ్ల మత్స్యకార భరోసా కార్యక్రమం కింద నిధులను ఏపీ సీఎం YS Jagan శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గానికి 27 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నాడన్నారు. ఏనాడూ కూడా చంద్రబాబుకు ఇళ్లు కట్టుకోవాలనే ఆలోచన రాలేదన్నారు. కానీ తన మూడేళ్ల పాలన చూసిన తర్వాత భయంతో కుప్పంలో ఇల్లు కట్టుకొనేందుకు పారిపోయాడన్నారు. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజలను నమ్ముకోకుండా కొడుకుని, దత్తపుత్రుడిని నమ్ముకున్నాడని ఏపీ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఉన్న నేతలు జనాన్ని నమ్ముకోవాలి కానీ ఇలా నేతలను నమ్ముకొంటారా అని ప్రశ్నించారు.
also read:జనంలోకి వెళ్లమన్నా .. ఇంకా కొందరు మొదలు పెట్టలేదు: కొత్త మంత్రులకు జగన్ క్లాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంత మంచి చేశామని చెప్పుకొనే ధైర్యం చంద్రబాబుకు కానీ ఆయన దత్తపుత్రుడికి కానీ ఉందా అని వైఎస్ జగన్ నిలదీశారు.పేద పిల్లలు గొప్పగా చదువుకోవాలని రాజకీయ నాయకుడు కోరుకోవాలి, కానీ చంద్రబాబు లాంటి నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని జగన్ మండి పడ్డారు. పేదింటి పిల్లలు ఎక్కడ ఇంగ్లీష్ చదివి గొప్పవాళ్ళు అవడమే కాకుండా తమను ప్రశ్నిస్తారనే భయం కూడా చంద్రబాబుకు ఉందని జగన్ విమర్శలు చేశారు.
ఇలాంటి ప్రతిపక్షం ఎక్కడైనా చూశామా అని జగన్ ప్రజలను ప్రశ్నించారు.టెన్త్ పేపర్లు లీక్ చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ చేయవద్దని TDP నేతలు గగ్గోలు పెట్టడాన్ని జగన్ తప్పు బట్టారు. పేపర్లు లీకయ్యాయని ఆందోళన చేస్తూనే ఇందుకు కారణమైన వారిని అరెస్ట్ చేస్తే మాత్రం ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేయడాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం మంచి చేస్తుంటే దుష్ట చతుష్టయానికి నచ్చడం లేదని సీఎం చెప్పారు. ఇళ్ల పట్టాలు, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులనుకూడా విపక్షం అడ్డుకొందని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు కావడానికి అవసరమైన నిధులు రాకుండా కూడా చంద్రబాబు అడ్డుకొనే కార్యక్రమాలు చేస్తున్నారని జగన్ విమర్శలు చేశారు.
కేంద్రం నుండి నిధులు వచ్చినా, బ్యాంకులు రుణాలిచ్చినా కూడా టీడీపీకి బాధేనని జగన్ చెప్పారు. Delhi నుండి గల్లీ వరకు అబద్దాలతో courtల్లో కేసులు వేస్తూ నిరంతరం ప్రజలకు ఇబ్బందులు కల్గించే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. రాష్ట్రానికి తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న ఈ రాబందులను ఏమనాలని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వారిని రాష్ట్ర ద్రోహులు అందామా, దేశ ద్రోహులు అందామా అని జగన్ ప్రజలను అడిగారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన చరిత్ర తమదన్నారు సీఎం జగన్.