ఉప్పొంగుతున్న కృష్ణా నది: ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష

By telugu teamFirst Published Aug 22, 2020, 10:11 AM IST
Highlights

కృష్ణా నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. పై నుంచి ఉధృతంగా ప్రవాహం కృష్ణా నదిలోకి వచ్చిపడుతోంది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

అమరావతి: కృష్ణానదిలోకి భారీగా వరదజలాలు వస్తున్న నేపథ్యంతో తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులతో సమీక్షించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోస్‌పై సీఎంఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

శనివారం మధ్యాహ్నం తర్వాత ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈమేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడనుంచి ప్రజలను ఖాళీచేయించాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న వరదను అంచనా వేసుకుని ఆమేరకు చర్యలు చేపట్టాలన్నారు. 

సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు గోదావరిలో కూడా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. వారికి ఆహారం, మందులు, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం స్పష్టంచేశారు. ఈమేరకు ఇరు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

click me!