కేసీఆర్ తో మాట్లాడుతున్నా, రాయలసీమను సస్యశ్యామలం చేస్తా: సీఎం జగన్

By Nagaraju penumalaFirst Published Sep 21, 2019, 8:51 PM IST
Highlights

 కృష్ణా ఆయకట్టు, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్‌ తెలిపారు. 

కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో నెలకొన్న వరద పరిస్థితిపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, మహానంది ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా వరద ముంపు ప్రభావాన్ని పరిశీలించారు. 

అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవుడి దయ వల్ల రాయలసీమలో వర్షాలు బాగా కురిశాయని జగన్ సంతోషం వ్యక్తం చేశారు. వర్షపాతం సాధారణ స్థాయికి వచ్చినట్లు రివ్యూలో చెప్పుకొచ్చారు. 

నంద్యాల డివిజన్‌లో 17 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. భారీ వర్షాల కారణంగా ఆర్‌ అండ్‌ బీ రోడ్లు, పీఆర్‌ రోడ్లు బాగా దెబ్బతిన్నాయని ఫలితంగా రూ. 784కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు స్పష్టం చేశారు. 

జిల్లాలో వరదల ప్రభావంతో 31వేల హెక్టార్లలో పంటనష్టం, 2వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో కుందు నది పరివాహక ప్రాంతంలో, నంద్యాల ప్రాంతంలో వరద నష్టం జరగకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 

ఇకపోతే కృష్ణా ఆయకట్టు, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్‌ తెలిపారు. 

భవిష్యత్తులో రాయలసీమలోని ప్రతి డ్యామును నీటితో నింపుతామని జగన్ హామీ ఇచ్చారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నంద్యాలలో చామ కాల్వ వెడల్పు, ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణానికి చర్యలు ప్రారంభించారని అవి మధ్యలోనే ఆగిపోయానని త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు. సాధారణంగా ఇచ్చే వరద సాయం కంటే ప్రతి ఇంటికి అదనంగా రూ.2 వేలు ఎక్కువ ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. వరద బాధితులుందరికి ఇళ్లు కట్టిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.  

ఈ సందర్భంగా నంద్యాల డివిజన్ లో వరద నష్టం, వరద సహాయక చర్యలపై కర్నూలు సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి  తిలకించారు.  

click me!