
పరిశోధనలు, పరస్పర సమాచార మార్పిడి ద్వారా ప్రయోగాలు జరగాలన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. శుక్రవారం హార్టికల్చర్,సెరికల్చర్,వ్యవసాయ అనుబంధశాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనుకూలమైన రకాల సాగు లక్ష్యంగా పరిశోధనలు వుండాలన్నారు. కర్నూలు జిల్లాలో మార్కెట్ అవకాశాలున్న ఉల్లి సాగుపై ఫోకస్ పెట్టాలని ఆయన సూచించారు. మిరప సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాసెసింగ్‌పైనా దృష్టి పెట్టాలని జగన్ కోరారు. కొబ్బరి సాగులో ఎదురవుతున్న సమస్యలపై పరిశోధనలు కొనసాగాలని.. అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని జగన్ ఆదేశించారు.
అవినీతికి తావు లేకుండా రైతులకు పరికరాలు అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా నైపుణ్య సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవాలి. నిరంతర పరిశోధనలు, పరస్పర సమాచార మార్పిడి ద్వారా అధ్యయనం, ప్రయోగాలు కొనసాగాలి.
ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగులో సమస్యల పరిష్కారం, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో కొత్త టెక్నాలజీ, ప్రాసెసింగ్‌కు అనుకూలమైన రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలు ఉండాలని’’ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతుభరోసా కేంద్రాలకు వచ్చినప్పుడు రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలను నివృత్తి చేసేలా వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. అగ్రికల్చర్ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలని జగన్ ఆదేశించారు.