22వేల జనతా బజార్లు... అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

Arun Kumar P   | Asianet News
Published : Apr 13, 2020, 08:59 PM IST
22వేల జనతా బజార్లు... అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

సారాంశం

వైఎస్సార్ జనతా బజార్ల ఏర్పాటుపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. 

అమరావతి: వైయస్సార్‌ జనతా బజార్ల ప్రతిపాదనలపై అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్‌చైన్, ప్రాసెసింగ్‌ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమంతో పాటు పలు ప్రతిపాదనలను సమావేశంలో చర్చించారు సీఎం. 

రాష్ట్రంలో 11వేలకు పైగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని... వీటిలో వైయస్సార్‌ జనతా బజార్లు పెట్టేదిశగా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు రావాలని... మండల కేంద్రాల్లో పెద్ద స్థాయిలో జనతా బజార్లను ఏర్పాటు చేయాలని సూచించారు. 
దాదాపుగా 22వేల జనతాబజార్లతో పెద్ద నెట్‌వర్క్‌ ఏర్పడుతుందన్నారు. 

రైతు బజార్లలో శీతలీకరణ యంత్రాలు పెట్టాలని సూచించారు. పాలు, పళ్లు, కూరగాయలు తదితర వాటిని నిల్వచేసి విక్రయానికి  అందుబాటులో పెట్టాలన్నారు. వీటివద్ద చిన్నసైజు ట్రక్కులు లేదా పికప్‌ వ్యాన్స్‌ కూడా పెట్టాలని... ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక ట్రక్కు ఉండాలన్నారు. ప్రతిరోజూ జనతా బజార్లకు కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు లాంటి సరుకులు తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయని సూచించారు.

మరోవైపు రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు అమ్ముకునే సరుకులను గోదాములకు లేదా దగ్గర్లో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు తరలించేందుకూ ఈ వాహనాలు ఉపగపడతాయన్నారు. జనతాబజార్లకు సంబంధించి మ్యాపింగ్‌ చేయాలని... ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రైతుజార్లను, మార్కెట్లను వికేంద్రీకరించాలని సూచించారు. 

ప్రతి నిత్యావసర వస్తువును దాదాపుగా ప్రతిగడప వద్దకూ చేర్చాలని సూచించారు. ఈ రైతు బజార్లతో రైతులకు మార్కెటింగ్‌ పరంగా ఇబ్బందులు రాకుండా తొలగిపోతాయన్నారు. 
లాభ, నష్టాలు లేని రీతిలో నిర్వహిస్తే ప్రజలకు మంచి ధరల్లో నిత్యావసరాలు లభిస్తాయన్నారు. ఇదే జనతా బజార్లలో చేపలు, రొయ్యల్లాంటి ఆక్వా ఉత్పత్తులు కూడా అమ్ముడుపోతాయన్నారు. 

ప్రతి నియోజకవర్గానికీ కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటు చేసేదిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. జనతా బజార్ల నిర్వహణను స్వయం సహాయ సంఘాలకు అప్పగించాలని... రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే ప్రక్రియలో ఈ ప్రయత్నం మేలు చేస్తుందన్నారు. మార్కెట్లో జోక్యంచేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. తద్వారా, రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుందని జగన్ పేర్కొన్నారు. 

ఇది సక్రమంగా చేయగలిగితే అటు రైతులకు ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని... గ్రామాల స్వరూపాలు మారిపోతాయని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా గోడౌన్లు ఉండే దిశగా అడుగులు వేయాలన్నారు. దీంతో గ్రామాల్లో గొప్ప మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టును అధికారులు ఓనర్‌ షిప్‌ తీసుకుని సమిష్టిగా పనిచేసి విజయవంతం అయ్యేలా చూడాలని...వైయస్సార్‌ జనతాబజార్ల ప్రాజెక్టుకు ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం