ఏపీలో కొత్తగా ఏడుగురికి పాజిటివ్: 439కి చేరిన కేసులు, గుంటూరులో అత్యధికం

By Siva KodatiFirst Published Apr 13, 2020, 8:05 PM IST
Highlights
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం కొత్తగా మరో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 439కి చేరింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. 
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం కొత్తగా మరో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 439కి చేరింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.

కాగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయానికి కొత్తగా రాష్ట్రంలో 12 కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో అత్యధికంగా 8, చిత్తూరులో రెండు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్టుగా అధికారులు ప్రకటించారు.12 గంటల్లో 12 కొత్త కేసులు  నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 93 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాడు రాత్రి వరకు కర్నూల్ జిల్లాలో అత్యధిక కేసులు ఉండేవి. అయితే సోమవారం నాడు ఉదయానికి కర్నూల్ జిల్లాను వెనక్కి నెట్టి గుంటూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
     
కరోనా నివారణా చర్యల్లో భాగంగా సోమవారం డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో వైద్య సేవలు కావాల్సిన వారు 14410 నెంబర్‌ను సంప్రదించాలి.

ఇందుకు గాను ఈ నెల 11 తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్‌లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు అందిస్తారు.

కోవిడ్ 19 కేసులను గుర్తించడం, ఐసోలేట్ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్‌‌కు పంపించడం వంటి సాయం చేస్తారు. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు అందిస్తారు. ఇందుకోసం డాక్టర్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది, వీరికి టెక్నికల్ అసిస్టెన్స్ టెక్నాలజీ టీం నుంచి లభిస్తుంది. 
click me!