విశాఖ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీలు...: సీఎం జగన్ కీలక నిర్ణయాలు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 13, 2021, 04:08 PM IST
విశాఖ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీలు...: సీఎం జగన్ కీలక నిర్ణయాలు (వీడియో)

సారాంశం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ పై  క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. 

అమరావతి: ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధికోసం ఒక కాలేజీని పెట్టబోతున్నామని సీఎం జగన్ ప్రకటించారు. విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీని, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీని పెట్టబోతున్నట్లు వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక అనేది హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, స్కిల్‌ యూనివర్శిటీలు రూపొందిస్తాయని... కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీ లాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో బోధన, శిక్షణ ఉంటుందిన సీఎం జగన్‌ స్పష్టం చేశారు.  

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ పై  క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

''గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం ద్వారా వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలకు, వర్క్‌ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఏర్పడుతుంది. దీనివల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు లభిస్తాయి'' అని సీఎం తెలిపారు.

''విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించిన హై ఎండ్‌స్కిల్స్‌ యూనివర్శిటీ పనులను వెంటనే మొదలుపెట్టండి. నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలి. తరగతి గదుల నిర్మాణం వినూత్నంగా ఉండాలి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలతో పాటు కొత్తగా నిర్మించనున్న మెడికల్‌ కాలేజీల తరగతి గదుల నిర్మాణంలో వినూత్న పద్ధతులు పాటించాలి'' అని సీఎం జగన్ ఆదేశించారు. 

వీడియో

''ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పాఠ్యాంశాలను అప్‌గ్రేడ్‌ చేయాలి. ప్రతి ఐటీఐలోనూ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ఆలోచన చేయాలి. దీనివల్ల నైపుణ్యాలు మెరుగుపడతాయి. టెన్త్‌లోపు డ్రాప్‌ అవుట్‌ అయిన యువకులకు నైపుణ్యాలను పెంపొందించడం, అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలి'' అని ఆదేశించారు. 

''కొత్తగా వచ్చే పరిశ్రమలకు మన వద్ద స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ పొందిన వారి డేటాను పంపించాలి. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి'' అని సీఎం అధికారులను ఆదేశించారు. 

read more  ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేను నిరాకరించిన సుప్రీంకోర్టు...

''డ్రింకింగ్‌వాటర్‌ ప్లాంట్లు, మోటార్లు, సోలార్‌ యూనిట్లు... ఇలా రోజువారీగా మనం చూస్తున్న చాలా వరకు అంశాల్లో నిర్వహణ, మరమ్మతుల్లో వారికి నైపుణ్యాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యం కోసం వినియోగిస్తున్న పరికరాలను నిర్వహణ, మరమ్మతుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాల్సి ఉంది. నైపుణ్యంలేని మానవవనరుల కారణంగా కొన్నిచోట్ల మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు సరిగ్గా నడవడం లేదు. నిర్వహణ కూడా సరిగా ఉండడం లేదు. ఇలా నిత్యజీవితంతో సంబంధం ఉన్న అంశాల్లో నైపుణ్యం ఉన్న మానవనరులను అభివృద్ధి చేయాల్సి ఉంది'' అని అన్నారు. 
 
''ఇంగ్లిషు భాషలో కూడా పరిజ్ఞానాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలి. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులను నిర్వహణకోసం నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించేలా ప్రణాళిక సిద్ధంచేసుకోవాలి'' అని సీఎం ఆదేశించారు.

''నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీంతో నియోజకవర్గ స్థాయిలో తప్పనిసరిగా నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ఒక పారిశ్రామిక శిక్షణా సంస్ధ ఏర్పాటవుతుంది. ప్రైవేటు ఐటీఐల్లో కనీస సదుపాయాలపైన కూడా దృష్టిపెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికెషన్‌ చేయించాలి. ప్రతి కాలేజీ, ఐటీఐ కూడా నిర్దేశిత ప్రమాణాలను సాధించే దిశగా అడుగు ముందుకేయాలి. ప్రభుత్వ ఐటీఐల్లో అవసరమైన టీచింగ్‌ స్టాఫ్‌ను పెట్టాలి. ప్రభుత్వ ఇంజినీరింగ్‌కళాశాలలు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో టీచింగ్‌ సిబ్బందిపై పరిశీలన చేయాలి'' అని సీఎం జగన్ ఆదేశించారు.

''ప్రతినెలా మూడురోజులపాటు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యేలా వారికి కేటాయించాలని ఇది వరకే ఆదేశాలు జారీచేశాం. ఐటీఐలు, నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో అవసరాలకు అనుగుణంగా శిక్షణ వుండాలి. శిక్షణ పొందిన వారికి అప్రంటిషిప్‌ వచ్చేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి. నిపుణుల చేత బోధన ఇప్పించేటప్పుడు దాన్ని డిజిటల్‌ పద్ధతిలో పొందుపర్చాలి. మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు ఆ వీడియోలను వినియోగించుకోవచ్చు'' అని సీఎం జగన్ సూచించారు.

ఈ సమీక్షా సమావేశానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ లావణ్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూధన్‌రెడ్డి, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె అజయ్‌ రెడ్డి, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌ బంగార్రాజు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

Anam Rama Narayana Reddy:థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు| Asianet News Telugu
Atchennaidu Appreciated Pawan Kalyan: ఇవి మినీ కలెక్టరేట్లలా పనిచేస్తాయి | Asianet News Telugu