డిగ్రీ కోర్సుల్లో మార్పులు.. పది నెలల అప్రెంటిస్‌షిప్, మరో ఏడాది శిక్షణ: జగన్

By Siva KodatiFirst Published Aug 6, 2020, 4:11 PM IST
Highlights

అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఉన్నత విద్యపై అమరావతిలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు

అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఉన్నత విద్యపై అమరావతిలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పెరగాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇప్పుడున్న 32.4 శాతం నుంచి దాన్ని 90 శాతానికి గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకు రావాలని... డిగ్రీ కోర్సులో అప్రెంటిస్‌ చేర్చామని, మూడేళ్ల డిగ్రీ కోర్సులో పది నెలల అప్రెంటిస్‌షిప్‌ను చేర్చామని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుందని, దీనిని డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తామని జగన్ చెప్పారు.

వృత్తి విద్యా డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్‌ ఉంటుందని ఆయన వెల్లడించారు. దీనికి అదనంగా 20 అడిషనల్‌ క్రెడిట్స్‌ సాధించేవారికి కూడా ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వాలని.. అడ్మిషన్లు పొందినప్పుడే సాధారణ డిగ్రీ కావాలా? లేదా ఆనర్స్‌ డిగ్రీ కావాలా? అన్న దానిపై  ఐఛ్చికాన్ని తీసుకుంటామని జగన్ తెలిపారు.

ప్రభుత్వ కాలేజీలను మెరుగు పరుద్దామన్న ఆలోచన గతంలో ఎవ్వరికీ రాలేదని.. ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో అత్యున్నత ప్రమాణాలతో బోధన అందించాలని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

పాత మెడికల్‌ కాలేజీలను మరమ్మతు చేసి వాటిలో నాడు – నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్‌ఫోన్‌ వెలుగులో ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చిందని జగన్ ప్రశ్నించారు. 

click me!