కడప జిల్లాలోని స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ భూమి పూజ నిర్వహించారు.
కడప: రూ. 8800 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు భూమి పూజ చేశారు. జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో గల సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అంశం ఎన్నికల సమంలో తీవ్ర ఎన్నికల అజెండా మారుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎష్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుండి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం శంకుస్థాపనలు జరిగాయి. ప్రభుత్వాలు మారాయి. కానీ ఫ్యాక్టరీ పనులు ముందుకు సాగలేదు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆందోళనలు, దీక్షలు, నిరసనలు కూడా సాగాయి.
2007 జూన్ 10న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2018 డిసెంబర్ 27న చంద్రబాబునాయుడు , 2019 డిసెంబర్ 23న వైఎస్ జగన్ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాజాగా ఇవాళ మరోసారి సీఎం జగన్ భూమి పూజ చేశారు.
తొలి విడతలో 10 లక్షల టన్నుల సామర్ధ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను చేపట్టనున్నారు. సున్నపురాళ్ల పల్లె తో పాటు సమీపంలో ఉన్న 3,148.68 ఎకరాలను స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.