ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
విజయవాడ:: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది కోసం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారంనాడు అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని సీఎం జగన్ చేతుల మీదుగా చేపట్టారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో 108 కుండలాల్లో హోమాలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఏపీ సీఎం జగన్ కు శేషవస్త్రం అందజేసి వేదఆశీర్వచనాలు అందించారు వేద పండితులు.
ఇవాళ ఉదయం శ్రీశివ సహస్రనామ చతుర్వేద పారాయణం చేశారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి,శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రస్వామిలు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు రోజులుగా ఇందిరాగాందీ స్టేడియంలో మహాజ్ఞం నిర్వహిస్తున్నారు.ఐదు రోజుల ్క్రితం సుదర్శన సహిత మహాయజ్ఞం నిర్వహించారు.