వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంపై రైతులకు లేఖలు రాయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇవాళ విద్యుత్ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ డిమాండ్ ఉన్న సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
హైదరాబాద్:వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు.గురువారం నాడు విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి రైతులకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు
.ఈ విషయమై రైతులకు లేఖలు రాయాలని సీఎం ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకం ఏ రకంగా విజయవంతమైందనే విషయాన్ని కూడా రైతులకు అధికారులు వివరించాలని సీఎం సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయడంతో ఆ జిల్లాలో 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని సీఎం ప్రస్తావించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల భవిష్యత్తులో ఈ భారం మొత్తం రైతులపై పడే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది.
అయితే రైతులు ఉపయోగించిన విద్యుత్ కు వారి ఖాతాల్లో డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ డబ్బును రైతులు విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం ఉపయోగించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు విషయమై రైతుల్లో అపోహలున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో మోటార్లకు మీటర్ల బిగింపు విషయమై పైలెట్ ప్రాజెక్టుగా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పైలెట్ ప్రాజెక్టులో విద్యుత్ ఆదా అయిందని అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విద్యుత్ సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మీటర్ల బిగింపు కారణంగా రైతులపై భారం పడదన్నారు. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న రోజుల్లో విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం సూచించారు. ధర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు పాడైన వెంటనే రిపేర్ చేయాలని కూడా ఆయన ఆదేశించారు.