కేసీఆర్ సర్కార్ నిర్ణయం బాగుంది... మీరూ ఫాలో కండి..: సీఎం జగన్ కు లోకేష్ లేఖ

By Arun Kumar PFirst Published Jan 17, 2022, 1:04 PM IST
Highlights

కరోనా థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో స్కూళ్లను ప్రారంభించకూడదని... తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే సెలవులను పొడిగించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు.  

అమరావతి: కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తూ ప్రమాదకరంగా మారుతోంది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సంక్రాంతి పండగ కోసం విద్యాసంస్థలకు ఇచ్చిన సెలవులను పొడిగించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇలాగే స్కూళ్ళు సెలవులు పొడిగించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం స్కూళ్లను పున:ప్రారంభానికి సిద్దమైంది. దీంతో జగన్ సర్కార్ కూడా విద్యాసంస్థల సెలవులను పొడిగించాలన్న డిమాండ్ మొదలయ్యింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ (ys jagan) కు లేఖ రాసారు నారా లోకేష్. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని సీఎం జగన్ ను లోకేష్ కోరారు. ఏపీలో థర్డ్ వేవ్ (corona third wave) ఉదృతమవుతోందన్న హెచ్చరికలను దృష్టిలో వుంచుకుని సంక్రాంతి పండగ (sankranthi festival) సందర్భంగా ఇచ్చిన సెలవులను మరికొన్నిరోజులు పొడిగించాలని లోకేష్ సూచించారు. 

''ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళ కూడా రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి. కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో వుంచుకుని తక్షణమే స్కూల్స్ కి సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు. 

''ప్రస్తుతం 15 ఏళ్లలోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ (corona vaccine) అందుబాటులోకి రాలేదు. కానీ గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుండి 5 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు,  తల్లిదండ్రులు,టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడొద్దు'' అని సూచించారు. 

''వైసిపి (YCP) ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలి. తక్షణమే స్కూల్స్ కి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి'' అంటూ లోకేష్ లేఖ ద్వారా సీఎం జగన్ ను డిమాండ్ చేసారు. 

సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏపీలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో కూడా సెలవులను పొడిగిస్తారని ప్రచారం జరిగింది. కానీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం ఈ ప్రచారానికి చెక్ పెడుతూ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే ఆలోచన లేదని  తేల్చి చెప్పారు.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. రోజులు 4 నుండి 5 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కోడి పందెలతో పాటు అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో స్కూళ్లను ప్రారంభించిన ఈ వ్యాప్తిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. దీంతో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలన్న డిమాండ్ పెరుగుతోంది.  

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 17 నుండి 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అయితే తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీ రాస్ట్రంలో కూడా విద్యా సంస్థలకు సెలవులను పొడిగించాలని విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ కూడా సెలవులను పొడిగించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు లేఖ రాసారు.   


 

click me!