జనవరి నాటికి వ్యాక్సిన్.. ప్రభుత్వం బాగా పనిచేస్తున్నా దుష్ప్రచారం: జగన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 29, 2020, 4:05 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.  వచ్చే జనవరి కల్లా కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.  వచ్చే జనవరి కల్లా కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేట్‌ 12.0 నుంచి 8.3 శాతానికి తగ్గుతుందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెరిగాయని.. కానీ, కేసులు తగ్గుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. మంగళవారం కరోనా నివారణ చర్యలపై అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 104 నంబర్‌కు ఫోన్‌ కొట్టిన వెంటనే ప్రజలకు టెస్ట్‌లు, హాస్పిటల్స్ వివరాలు అందాలని సీఎం అన్నారు.

ఈ నంబర్‌కు మాక్‌ కాల్స్‌ చేసి నంబర్‌ పనిచేస్తుందా లేదా పీరియాడికల్‌గా చెక్‌ చేయాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని సూచించారు. ఈ నంబర్‌కు ఫోన్‌ చేయగానే అరగంటలోనే బెడ్‌ అందుబాటులో ఉందో లేదో చెప్పాలని జగన్ అధికారులను ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ కింద కరోనాకు ఉచితంగా వైద్య సేవలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం అని స్పష్టం చేశారు. కోవిడ్‌ ఆస్పత్రుల జాబితా గ్రామ సచివాలయాల్లో ఉండాలని జగన్ సూచించారు. ఎంప్యానల్‌ ఆస్పత్రుల లిస్టు కూడా అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు. 

ఇదే సమయంలో ప్రభుత్వ పనితీరుపై జరుగుతున్న దుష్ప్రచారంపైనా జగన్ స్పందించారు. మనం చంద్రబాబు అనే వ్యక్తితో కాక, నెగిటివ్‌ మైండ్‌సెట్‌తో ఉన్న కొన్ని మీడియా సంస్థలతో కూడా యుద్ధం చేస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.

మనం ఎంత బాగా పనిచేస్తున్నా వేలెత్తి చూపే దుర్భుద్దితో పనిచేస్తున్నారని సీఎం విమర్శించారు. అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అలాగే నెగిటివ్‌ వార్తలు చదువుతూనే.. వాటిలో మనం కరెక్ట్‌ చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసుకుందామని వారు అతిగా రాసినవి కూడా ఎత్తిచూపుదామని జగన్మోహన్ రెడ్డి తేల్చిచెప్పారు. 

click me!