ఏమిచ్చినా పులివెందుల రుణం తీర్చుకోలేను.. తప్పు చేస్తే క్షమించండి: జగన్

By Siva KodatiFirst Published Dec 24, 2020, 2:57 PM IST
Highlights

కడప జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించి పనులు చక్కగా జరుగుతున్నాయని చెప్పారు

కడప జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించి పనులు చక్కగా జరుగుతున్నాయని చెప్పారు.

పులివెందులలో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, కూలర్, కోల్డ్ స్టోరేజ్‌కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని జగన్ చెప్పారు. నల్లచెరువుపల్లె గ్రామంలో 132కేవీ సబ్ స్టేషన్‌ పనులు బాగున్నాయన్నారు.

నూలివీడు, పందికుంట, కొల్లకుంట రోడ్డు వెడల్పు పనులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పులివెందులలో ఏరియా హాస్పిటల్, వేంపల్లిలో కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్‌ను 30 పడకల నుంచి 50 పడకల స్థాయికి పెంచామన్నారు.

ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టు, బాస్కెట్ బాల్, హాకీ, హ్యాండ్‌బాల్, సాఫ్ట్ బాల్‌లకు సంబంధించిన పనులు బాగా జరుగుతున్నాయని జగన్ చెప్పారు.

ఇడుపులపాయలో పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమొరియల్ గార్డెన్స్ అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయన్నారు. పులివెందుల పరిధిలోని 51 దేవాలయాల పునరుద్ధరణ, 18 కొత్త దేవాలయాల నిర్మాణం చకచకా జరుగుతోందని జగన్ వెల్లడించారు.

పులివెందులో మినీ సచివాలయం, మోడల్ పోలీస్ స్టేషన్, వేంపల్లిలో నూతన ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. పులివెందుల నియోజకవర్గానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని, తనను ఇక్కడి ప్రజలు సొంత కొడుకులా చూసుకున్నారని జగన్ చెప్పారు.

గండికోట నుంచి చిత్రావతి, పైడిపాలం జలశయాలను నలభై రోజుల్లో నింపేందుకు రూ.3 వేల కోట్ల రూపాయలతో లిఫ్ట్ స్కీంను ఈ రోజు శంకుస్థాపన చేశామని సీఎం తెలిపారు. వీటి ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు రోజుకు 4 వేల క్యూసెక్కులు, పైడిపాలెం జలాశయానికి 2 వేల క్యూసెక్కుల విడుదలకు అవకాశం కలుగుతుందన్నారు.

ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఇప్పటికే జ్యూడీషియల్ ప్రివ్యూ కూడా పూర్తయ్యిందని, 26న టెండర్లు అప్‌లోడ్ చేస్తామని, మార్చికల్లా పనులు కూడా ప్రారంభమవుతాయని జగన్ స్పష్టం చేశారు.

పులివెందుల బ్రాంచ్ కెనాల్, సీబీఆర్ కుడికాలువ, జీకేఎల్ఐల కింద వున్న 1 లక్షా 38 వేల ఎకరాల భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. దేవుని దయ వలన ఈ రెండు సంవత్సరాలు శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా వున్నాయని.. కానీ గతంలో తగ్గుతూ వచ్చిందన్నారు.

పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు వస్తేనే రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి కూడా నీరు అందుతుందన్నారు. పులివెందులలో ఆర్టీసీ బస్ స్టేషన్, డిపో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 14.5 కోట్ల రూపాయలతో గండి శ్రీరామాంజనేయ స్వామి దేవస్థానంలో గర్భాలయం, మండపం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని జగన్ చెప్పారు.

పులివెందులలోని రంగనాథ స్వామి ఆలయం, మిట్ట మల్లేశ్వర స్వామి ఆలయం, అంకాలమ్మ గుడి, తూర్పు ఆంజనేయ స్వామి దేవస్థానాలను 3.6 కోట్లతో అభివృద్ధి చేయాలని ఆదేశాలిచ్చామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అభివృద్ధి పనుల కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు వారి పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా జగన్.. కలెక్టర్‌ను ఆదేశించారు. 

click me!