తప్పుదోవ పట్టిస్తున్నారు .. ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు : తుఫాను బాధితులతో సీఎం వైఎస్ జగన్

By Siva KodatiFirst Published Dec 8, 2023, 4:02 PM IST
Highlights

రైతు భరోసాతో పాటు ఖరీఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మిచౌంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆయన శుక్రవారం పరామర్శించారు

రైతు భరోసాతో పాటు ఖరీఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మిచౌంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆయన శుక్రవారం పరామర్శించారు. గతంలో కరువు వచ్చినా, వరద వచ్చినా పట్టించుకునే పరిస్ధితి లేదని చంద్రబాబు హయాంలో వరుసగా కరువే వచ్చినా , ఇచ్చింది ఎంత అని జగన్ ప్రశ్నించారు. సంక్రాంతి లోపు అందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని సీఎం వెల్లడించారు. రేషన్‌తో పాటు ప్రతి ఇంటికి రూ.2500 ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 

అపోహలు, అబద్ధాలు చెప్పేవారిని నమ్మొద్దని చాలా మంది దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. వాళ్లకు కావాల్సిన వ్యక్తిని సీఎం చేయాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. తుఫాను వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూసుకుంటామని సీఎం తెలిపారు. బాధితులను గుర్తించి పారదర్శకంగా సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

Latest Videos

అంతకుముందు తిరుపతి జిల్లా బాలిరెడ్డిపాలెం గ్రామంలో సీఎం వైఎస్ జగన్ బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులను పెట్టామన్నారు. 8364 మందిని ఈ క్యాంపులకు తరలించి వసతి , భోజన ఏర్పాట్లు చేసినట్లు సీఎం వెల్లడించారు. 60 వేల మందికి పైగా 25 కేజీల రేషన్ బియ్యం, కందిపప్పు, పామాయిల్ లీటర్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అందించామని జగన్ చెప్పారు. 
 

click me!