ఉగాది నుంచే ఉనికిలోకి కొత్త జిల్లాలు.. వాళ్లను అక్కడికి పంపండి, తేల్చిచెప్పిన జగన్

Siva Kodati |  
Published : Feb 10, 2022, 06:43 PM IST
ఉగాది నుంచే ఉనికిలోకి కొత్త జిల్లాలు.. వాళ్లను అక్కడికి పంపండి, తేల్చిచెప్పిన జగన్

సారాంశం

ఉగాది నుంచి కొత్త జిల్లాల (ap new districts) నుంచి పాలన అందించాలని సీఎం జగన్ (ys jagan) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే ఓఎస్డీల హోదాలో కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాల్సి వుంటుందన్నారు.   

ఉగాది నాటికి కొత్త జిల్లాల (ap new districts) నుంచి పాలన అందించాలని సీఎం జగన్ (ys jagan) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు నుంచే కలెక్టర్లు , ఎస్పీలు కార్యకలాపాలు నిర్వహించేలా సన్నాహాకాలు పూర్తి చేయాలని ఆదేశాల్లో తెలిపారు. ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను కొత్త జిల్లాలకు పంపాలని ఆదేశించారు సీఎం. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే ఓఎస్డీల హోదాలో కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాల్సి వుంటుందన్నారు. 

కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అనంతరం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 26వ తేదీ వరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను కూడా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో కోరింది.

కొత్తగా ఏర్పడే జిల్లాలకు బాలాజీ, అల్లూరి, సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్, సత్యసాయిబాబాల పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకొంది. తిరుపతి కేంద్రంగా ఏర్పడనున్న జిల్లాకు శ్రీ బాలాజీ, విజయవాడ జిల్లా కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేర్లు పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. 

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన నరసరావుపేటను జిల్లాగా ప్రకటిచడం కంటే పల్నాడుకు నడిబొడ్డగా ఉన్న గురజాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. నరసరావుపేటను జిల్లాగా ప్రకటిస్తే.. పల్నాడు వాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అయితే హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. హిందూపురం ప్రజల మనోభవాలను అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిల్లాలకు కాపు కులస్తులైన కొందరి ప్రముఖుల పేర్లను ప్రతిపాదిస్తున్నట్టు కాపు సంక్షేమసేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి వెంకట హరిరామజోగయ్య ప్రభుత్వానికి లేఖ రాశారు. విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరును, గుంటూరు జిల్లాకు స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు పేరును, శ్రీ కృష్ణ దేవరాయులు పేరును అనంతపురం జిల్లాకు పెట్టాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. 

నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ఎంపిక చేయడంలో ఆ ప్రాంత వైసీపీ నాయకులు విజయం సాధించారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.  మరో వైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడ కొత్త జిల్లాలకు కొందరి పేర్లను ప్రతిపాదిస్తూ సీఎం జగన్ కు లేఖ రాశారు.తూర్పు లేక పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు.. ఏదో ఒక జిల్లాకి శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని ఆ లేఖలో సీఎం ను ముద్రగడ పద్మనాభం కోరారు.

బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూలపాడు అసెంబ్లీని ఒంగోలు జిల్లాలో చేర్చారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోకి మార్చారు. మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని పెనమలూరు, గన్నవరం శాసనసభ స్థానాలు విజయవాడ నగర పరిధిలోకి వచ్చాయి. అయితే ఇవి ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి కాకుండా.. కృష్ణా జిల్లాలోనే ఉంచారు. తాజా మార్పులతో కొన్ని లోక్‌సభ స్థానాలకు 8 అసెంబ్లీ స్థానాలు వస్తుంటే.. మరికొన్ని జిల్లాలు 6 శాసనసభ స్థానాలతోనే ఏర్పాటు కానున్నాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu
Raghurama KrishnamRaju: మావాళ్లని మోసం చేయొద్దు | Update on Akividu Ramalayam | Asianet News Telugu