
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 27న ఆయన హస్తినకు బయల్దేరి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై జగన్ ఈరోజు అధికారులతో చర్చించారు. మౌలిక వసతులు , పెట్టుబడులు, మహిళా సాధికారత, ఆరోగ్యం, పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్‌మెంట్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై నీతి ఆయోగ్ పాలక మండలి చర్చించనుంది. ఇదే సమయంలో ఏపీలో తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, తల్లి పిల్లల ఆరోగ్యం, నాడు నేడు తదితర అంశాలపై జగన్ వివరించనున్నారు.
ఇకపోతే మార్చి 30న జగన్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో ఆయన భేటీ అయ్యారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. తక్కువ వ్యవధిలోనే సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.