ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు గాను జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న కీలక సమావేశానికి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తూ వస్తున్న ఆయన.. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తూ వచ్చారు. ప్రజా వ్యతిరేకత వుంటే ఆత్మీయులు, సన్నిహితులకైనా టికెట్లు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు గాను జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న కీలక సమావేశానికి పిలుపునిచ్చారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మీటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అన్ని స్థాయిలకు చెందిన దాదాపు 2 వేల మంది నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. వై నాట్ 175 లక్ష్యంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని జగన్మోహన్ రెడ్డి నేతలకు సూచించనున్నారు. ప్రత్యర్ధుల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో, ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలనే దానిపై నేతలకు ముఖ్యమంత్రి వివరించనున్నారు.
కాగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో వైసీపీ ‘‘సిద్ధం ’’ పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభల్లో పాల్గొన్న జగన్.. విపక్షాలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మార్చి 3న మరో సిద్ధం సభకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.