Heavy Rains in AP: బాధితులకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం: సీఎం జగన్ నిర్ణయం

By Arun Kumar P  |  First Published Nov 12, 2021, 1:44 PM IST

భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న బాధిత ప్రజలకు తక్షణ సాయం కింద వెయ్యి రూపాయలు అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు వర్షప్రభావం ఎక్కువగా వున్న జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేసారు.


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసాయి. ఈ అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న బాధిత ప్రజలకు తక్షణ సాయం అందించాలని సీఎం జగన్. బాధితులకు ఆహారంతో పాటు కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

వర్షప్రభావం ఎక్కువగా వున్న  ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల కలెక్టర్లకు CM YS Jaganmohan Reddy కీలక సూచనలు చేసారు. ముంపు ప్రాంతాల వారిని ప్రత్యేక శిబిరాలకు తరలించాలని... ఇక్కడ వారిని బాగా చూసుకోవాలని ఆదేశించారు. బాధితులకు పునరావాస శిబిరాల్లో నీరు, మంచి ఆహారం అందించాలని ఆదేశించారు. 

Latest Videos

undefined

బాధితులు కూడా ఎలాంటి సహకారం కావాలన్నా వెంటనే అడగాలని సూచించారు. బాధితుల కోసం ఫోన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 

read more  అల్పపీడనం ఎఫెక్ట్: సముద్రంలో బోల్తాపడ్డ బోటు.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన మత్స్యకారులు

బంగాళాఖాతంలో ఇటీవల అల్పపీడనం ఏర్పడి అదికాస్తా బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో నిన్నటి నుండి andhra pradesh లో భారీనుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన సీఎం జగన్ గురువారం కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షతీవ్రత అధికంగా వున్న  చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు Ndrf, Sdfr బృందాలను పంపాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ప్రజలు నిత్యావసర సరుకులు అందకుండా ఇబ్బంది పడే అవకాశాలుంటాయని... ఈ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. 

ఇక శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షప్రభావం ఎక్కువగా వున్న కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. విద్యార్థులెవ్వరూ ఇళ్లను వదిలి బయటకు రావద్దని అధికారులు సూచించారు.

చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో భీమా,స్వర్ణముఖి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరదనీరు ప్రమాదకరంగా ప్రవహించడంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలలో కూడా భారీ వర్షం కురవడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదనీరు కూడా ప్రమాదకర రీతిలో కొండపైనుండి కిందకు ప్రవహించడంతో గురువారం రాత్రి తిరుమల ఘాట్ రోడ్డును మూసివేసారు. శుక్రవారం నాడు ఉదయం నుండి ఘాట్ రోడ్డుపై ప్రయాణించేందుకు అధికారులు అనుమతించారు.

read more  తిరుపతిలో వర్షబీభత్సం.. దాదాపు నగరమంతా నీటిలోనే, రాత్రంతా వానపడితే భయానకమే
 
కడప జిల్లా రోయచోటి, రాజంపేటల్లో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తుంది.  వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వరి, వేరుశనగ, బొప్పాయి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే వెంటనే  సమాచారం అందించాలని సూచించారు.
 

click me!