విస్తరిస్తోన్న లంపీ వైరస్... పశువులు జాగ్రత్త, అధికారులకు జగన్ కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Sep 27, 2022, 3:18 PM IST
Highlights

లంపీ వైరస్‌పై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. జంతువుల్లో లంపీ వైరస్‌ వ్యాపిస్తుందన్న సమాచారం వస్తోందని జగన్ అన్నారు. అలాగే పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

స్వచ్ఛమైన పాల ఉత్పత్తి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పశు సంవర్థక శాఖపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలని సూచించారు. ఆర్గానిక్‌ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని జగన్ ఆదేశించారు. అమూల్‌ ద్వారా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆలోచన చేయాలని సీఎం సూచించారు. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీని పూర్తిచేయాలని.. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. 

వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతంచేయాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్య సేవలు అందిస్తామని సీఎం అన్నారు. లంపీ వైరస్‌పై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. జంతువుల్లో లంపీ వైరస్‌ వ్యాపిస్తుందన్న సమాచారం వస్తోందని జగన్ పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

ALso REad:ఓవైపు అమరావతి నిబంధనల సవరణ.. మరోవైపు న్యాయపోరాటం: మూడు రాజధానుల కోసం జగన్ భారీ కౌంటర్ ప్లాన్

అలాగే పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆడిట్‌ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా పశువుల ఆరోగ్యాలను పరిశీలించి, పరీక్షించి వాటి వివరాలను పశు ఆరోగ్య కార్డుల్లో అప్‌గ్రేడ్‌ చేయాలని ఆయన ఆదేశించారు. వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలని జగన్ ఆదేశించగా.. సెకండ్‌ ఫేజ్‌ కింద అక్టోబరులో మరిన్ని పశు అంబులెన్స్‌లు ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్బీకేలలో, కమ్యూనిటి హైరింగ్‌ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. 
 

click me!