ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 3.39 లక్షల మంది కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 3 లక్షల మందికి రూ. 137 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విడుదల చేశారు.
అమరావతి: అధికారం అంటే ప్రజలపై అజమాయిషీ చేయడం కాదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో సుమారు 3.39 లక్షల మంది అర్హులను కొత్త లబ్దిదారులుగా గుర్తించింది ప్రభుత్వం. ఈ కొత్త లబ్దిదారులకు రూ. 137 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు విడుదల చేశారు. వైఎస్ఆర్ పెన్షన్, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డులను కొత్త లబ్దిదారులకు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అధికారం అంటే ప్రజలపై మమకారమని తమ ప్రభుత్వం రుజువు చేసిందన్నారు.ఈ మేరకు అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలను వర్తింపచేస్తున్నామన్నారు. కొత్త లబ్దిదారులను ఆయా పథకాల్లో చేర్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ. 137 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. ప్రభుత్వంపై భారాన్ని లెక్క చేయకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
అర్హులైన వారికి సంక్షేమ పథకాలను ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే నిరంతరాయంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను సాగిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ పథకాలు అందించే విషయంలో కులం, మతం, పార్టీలు అనే తారతమ్యాలు చూపడం లేదన్నారు. పారదర్శకంగానే సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్నామన్నారు.