కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ భేటీ... వాటిపైనే చర్చ

By Arun Kumar PFirst Published Dec 16, 2020, 12:22 PM IST
Highlights

ప్రస్తుతం డిల్లీ పర్యటనలో వున్న ఏపీ సీఎం జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. 

న్యూడిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ పోలవరంకు సంబంధించిన సవరించిన అంచనాలకు  ఆమోదంపై చర్చజరిగింది. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపై చర్చిస్తున్నారు.  ఖర్చుపెట్టిన నిధులను త్వరితగతిన విడుదల చేయాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశాలున్నాయి. 

నిన్న(మంగళవారం) రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా సీఎం జగన్ భేటీ అయ్యారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని అమిత్ షాను కోరారు సీఎం జగన్. అధికార వికేంద్రీకరణ, ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించే విధంగా ప్రణాళిక వేసుకున్నామని ఆయన అమిత్ షాకు చెప్పారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజదానిగా చేస్తూ ఆగస్టులో చట్టం చేసిన విషయాన్ని ఆయన చెప్పారు. 

బిజెపి 2019 ఎన్నికల ప్రణాళికలో కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. హోం మంత్రితో జరిగిన చర్చల వివరాలను వెల్లడిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

రెండవ రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్‌ (2వ ఆర్‌సీఈ) ప్రకారం 2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టుకోసం అయ్యే రూ, 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్‌ చేయాలని కూడా ఆయన హోం మంత్రిని కోరారు. 

2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగిందని, అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, దీనివల్ల ఆర్‌ అండ్‌ ఆర్‌కోసం పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా ఆయన చెప్పారు. పోలవరం నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1779 కోట్ల రూపాయలను రియింబర్స్‌ చేయాల్సి ఉందని తెలిపారు. 

2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈబిల్లులు పెండింగులో ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు ఇంకా  పెరిగిపోతుందని, ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు  జాతీయ ప్రాజెక్ట్ పోలవరాన్ని సత్వరం పూర్తిచేయడానికి తగిన విధంగా సహాయం అందించాలని కోరారు. 

కోవిడ్‌ సమయంలో తీసుకున్న చర్యలను జగన్ అమిత్ షాకు వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడ్డమేకాకుండా, ప్రజల జీవనోపాధికి ఇబ్బందులు రాకుండా, రెండింటి మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుసాగిన విషయాన్నిఆయన వివరించారు. అత్యంత క్లిష్టమైన కోవిడ్‌సమయంలో వివిధ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకున్న తీరును వివరించిన సీఎంకోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేయడానికి ఉద్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని, వ్యాక్సిన్‌ సరఫరాలో అత్యంత కీలకమైన కోల్డ్‌చైన్ల ఏర్పాటు, నిర్వహణకు సమాయత్తంగా ఉన్నామని ఆయన వివరించారు. 

 

click me!