పోలవరం ప్రాజెక్టుకు రూ. 10 వేల కోట్లు ఇవ్వాలి: గడ్కరీకి బాబు లేఖ

First Published 25, Jun 2018, 6:34 PM IST
Highlights

పోలవరంపై నిధుల కోసం  గడ్కరీకి బాబు లేఖ


అమరావతి:;పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ కోసం వెంటనే రూ. 10 వేల కోట్లను అడ్వాన్స్‌గా విడుదల చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి  సోమవారం నాడు లేఖ రాశారు.

సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆదివారం నాడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత బీజేపీ నేతలు చేసిన విమర్శలపై చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ నేతలు చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు.

ఈ మేరకు  ఈ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బాబు లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని ఆయన మీడియాకు విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు భూసేకరణ కోసం రూ.10 వేల కోట్లు అత్యవసరమని ఆయన ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. అడ్వాన్స్‌గా ఈ రూ. 10 వేల కోట్లను చెల్లించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారంగా రూ. 57, 940 కోట్లకు చేరుకొన్న విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.. ఈ మేరకు సవరించిన అంచనాల వివరాలను సీడబ్ల్యూసీకి పంపినట్టు ఆయన తెలిపారు. సవరించిన అంచనాలను ఆమోదించాలని బాబు ఆ లేఖలో  గడ్కరీని కోరారు.

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1504 కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. ఈ నిధులను వెంటనే రాష్ట్రానికి విడుదల చేయాలని చంద్రబాబు ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు.
 

Last Updated 25, Jun 2018, 6:34 PM IST