
అమరావతి: తిత్లీ తుఫాన్ బాధితులకు అండగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. తుఫాన్ బాధితులను ఆదుకొనేందుకు ప్రభుత్వం పని చేస్తోంటే ... సహాయక చర్యలను ఆటంకపర్చేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా విపక్షాల తీరును దుయ్యబట్టారు. ప్రభుత్వం పలాస వచ్చి తుఫాన్ బాధితులకు సహాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంటే... రోడ్లమీదకు రండి.. గొడవలు చేయడంటూ రెచ్చగొడుతున్నారని చంద్రబాబునాయుడు విపక్షాల తీరుపై మండిపడ్డారు.
సహాయకచర్యలకు ఆటంకాలు కల్పిస్తే కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టి సహాయకచర్యలకు ఆటంకం కల్పించవద్దని బాబు సూచించారు.
తిత్లీ తుఫాన్ కారణంగా ఏపీలోని వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వంతో కలిసిరావాలని బాబు కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాల్సిందిగా ఆయన ట్వీట్ చేశారు.