
ఇవాళ ప్రధాని మోడీ సభను వ్యతిరేకిస్తూ రాష్ట్రం మొత్తం ఒక్క మాటపై వుంటే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఎక్కడ దాక్కున్నారో జనం నిలదీయాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019తో పాటు ప్రధాని గుంటూరు పర్యటన సందర్భంగా ఆయన ఇవాళ పార్టీ నేతలతో చర్చించారు.
ప్రజలంతా మోడీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుంటే జగన్ హైదరాబాద్‌లో దాక్కుని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. వైసీపీ తరపున అన్ని పార్టీలు నిరసనలు తెలుపుతున్నాయని, జగన్ బీజేపీతో లాలూచి పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.
ప్రధాని పర్యటనకు జగన్ సహకరిస్తున్నారనే విషయం ప్రతి గ్రామంలో తెలిసేలా చెయ్యాలని నేతలకు పిలుపునిచ్చారు. రేపటి ఢిల్లీ దీక్షకు ప్రజలందరి మద్ధతు తీసుకోవాలని సూచించారు.
తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి దేశంలోని అత్యున్నత వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ర్యాలీలలో రెండు కుండలను పగులగొట్టాలని.. ఒక కుండ నరేంద్రమోడీ, రెండో కుండ జగన్మోహన్ రెడ్డిదని ఎద్దేవా చేశారు.