చంద్రబాబు విచారణపై హైకోర్టు స్టే: సుప్రీంకోర్టుకు ఎక్కనున్న ఏపీ సిఐడి

By telugu teamFirst Published Mar 20, 2021, 1:06 PM IST
Highlights

టీడీపీ చీఫ్ చంద్రబాబు విచారణపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఏపీ సీఐడీ ఆలోచిస్తోంది. అమరావతి భూముల కేసులో ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడి చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: అమరావతి భూముల కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విచారణపై హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ సీఐడి ఆలోచిస్తోంది. హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

అమరావతి భూముల కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ విచారణలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలసిందే. కేసు విచారణను హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. చంద్రబాబు, నారాయణ విచారణలను మాత్రమే ఆపేయాలంటున్నామని, కేసు దర్యాప్తును సిఐడి కొనసాగించవచ్చునని హైకోర్టు తేల్చి చెప్పింది. 

ఈ నెల 23వ తేదీన విచారణకు రావాలని ఏపీ సిఐడి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన నారాయణను విచారణకు పిలిచింది. దీంతో వీరిద్దరు సిఐడి ఎఫ్ఐఆర్ ను హైకోర్టులో సవాల్ చేశారు. దాంతో వారి విచారణపై కోర్టు స్టే ఇచ్చింది. 

అమరావతి భూముల కేసులో సిఐడి అధికారులు ఇప్పటికే వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని ప్రశ్నించారు. అమరావతి భూముల వ్యవహారంపై ఆళ్ల రామకృ్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణకు కమిటీ వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా సిఐడి కేసులు నమోదు చేసింది. చంద్రబాబు పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ఎ్ససీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా ఉంది. 

click me!