3 గంటల పాటు సీఐడీ విచారణ: ఎవరీ రంగనాయకమ్మ, వివాదం ఎమిటి?

By narsimha lodeFirst Published May 21, 2020, 5:38 PM IST
Highlights

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ నుండి స్టెరిన్ గ్యాస్ లీక్ కావడంతో ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్టుకు సంబంధించి రంగనాయకమ్మను సీఐడీ అధికారులు గురువారం నాడు మూడు గంటల పాటు విచారించారు.


అమరావతి: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ నుండి స్టెరిన్ గ్యాస్ లీక్ కావడంతో ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్టుకు సంబంధించి రంగనాయకమ్మను సీఐడీ అధికారులు గురువారం నాడు మూడు గంటల పాటు విచారించారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి ఈ పోస్టు పెట్టిందని సీఐడీ పోలీసులు ఆమెకు మూడు రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం సీఐడీ కార్యాలయంలో ఆమె సీఐడీ కార్యాలయానికి చేరుకొన్నారు. మూడు గంటల పాటు ఆమెను పోలీసులు విచారించారు. మరోసారి విచారణకు కూడ రావాలని సీఐడీ అధికారులు ఆదేశించారు.

ఈ పోస్టు పెట్టిన రంగనాయకమ్మతో పాటు మరోక వ్యక్తిని కూడ విచారణ చేయనున్నారు. ఇద్దరిని కలిపి విచారించే ఛాన్స్ ఉంది. అందుకే వీరిద్దరిని కలిపి విచారించే అవకాశం ఉంది.గతంలో ఫేస్ బుక్ పోస్టులపై కూడ పోలీసులు విచారించినట్టుగా చెప్పారు.

రంగనాయకమ్మపై సీఐడీ కేసు పెట్టడంతో  విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చంద్రబాబుతో పాటు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె. రామకృష్ణ కూడ ఈ విషయమై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన పూలతోట రంగనాయకమ్మ కుటుంబం వ్యాపారం చేస్తోంది. గుంటూరు పట్టణంలోని శంకర్ విలాస్ హోటల్ కు రంగనాయకమ్మ డైరెక్టర్ గా ఉంది.

రంగనాయకమ్మ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఫేస్ బుక్ లో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు.దేశంలో చోటు చేసుకొంటున్న పలు సమస్యలపై ఆమె చురుకుగా సోషల్ మీడియాలో స్పందిస్తారు.

ఫేస్‌బుక్ లో తన అభిప్రాయాలను అందరితో ఆమె పంచుకొంటారు. రంగనాయకమ్మ టీడీపీ సానుభూతిపరురాలు తన ఫేస్ బుక్ అకౌంట్ లో చంద్రబాబు ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకొన్నారు. 

విశాఖ ఎల్జీ పాలీమర్స్  ఘటనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఈ నెల 12వ తేదీన రంగనాయకమ్మ తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. విశాఖ ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి 20 ప్రశ్నలను సంధించారు. 

రఘునాథ్ మల్దాది అనే వ్యక్తి నుండి దీన్ని సేకరించినట్టుగా రంగనాయకమ్మ ఈ పోస్టులో పెట్టారు. ఈ పోస్టును సీఐడీ సీరియస్ గా తీసుకొంది. రంగనాయకమ్మను ఏ 1గా, మల్లాది రఘునాథ్ ను ఏ2గా చేర్చారు. విశాఖలోని ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన చాలా సున్నితమైన అంశమని సీఐడీ తెలిపింది.

విశాఖ గ్యాస్ లీకేజీపై ప్రభుత్వంపై రంగనాయకమ్మ దుష్ప్రచారం చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. తప్పుడు ప్రచారంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. రంగనాయకమ్మపై సెక్షన్ 505(2) సెక్షన్ 153(ఏ), సెక్షన్ 188, సెక్షన్ 120(బి) రెడ్ విత్ ఐపీసీ సెక్షన్ 34 కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.

click me!