పవర్‌లెస్ సీఎం చంద్రబాబు: ఎల్వీ ఆడిందే ఆట

By narsimha lodeFirst Published Apr 25, 2019, 4:13 PM IST
Highlights

పీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ెల్వీ సుబ్రమణ్యం  బాధ్యతలు స్వీకరించిన తర్వాత  ఏపీలో పాలన ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే కారణాన్ని చూపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నప్పటికీ కూడ సీఎస్ అన్నీ తానై రాష్ట్రంలో పాలనను నడిపిస్తున్నారు.
 

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ెల్వీ సుబ్రమణ్యం  బాధ్యతలు స్వీకరించిన తర్వాత  ఏపీలో పాలన ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే కారణాన్ని చూపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నప్పటికీ కూడ సీఎస్ అన్నీ తానై రాష్ట్రంలో పాలనను నడిపిస్తున్నారు.

ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందే ఏపీ సీఎస్‌గా ఉన్న అనిల్ పునేఠ స్థానంలో  ఎల్వీ సుబ్రమణ్యాన్ని  సీఎస్ గా నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకొంది.జగన్ కేసులో ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఏపీ సీఎస్‌గా నియమించడాన్ని సీఎం చంద్రబాబునాయుడు  బహిరంగంగానే తప్పుబట్టారు.

ఏపీలో ఎన్నికలు జరిగే సమయంలో  ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ పార్టీ నేత కేసులో  ఉన్న వ్యక్తిని సీఎస్‌గా ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు సీఎస్ గా నియమించే సమయంలో తనతో కనీసం కూడ సంప్రదింపులు జరపలేదని ఆయన మండిపడ్డారు.

ఏపీలో ఈసీ ఉద్దేశ్యపూర్వకంగానే వ్యవహరాలను సాగించిందని చంద్రబాబునాయుడు ఆరోపణలు చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు, తాగునీటి సరఫరాల, సీఆర్‌డీఏ వ్యవహరాలపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. కోడ్ ఉన్న సమయంలో సీఎం  సమీక్షలు నిర్వహించడాన్ని  ఈసీ తప్పుబట్టింది.

ఈ విషయమై సీఎం సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులకు సీఎస్ నోటీసులు జారీ చేశారు.మరో వైపు ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం కూడ ఆరా తీసింది. దీంతో చంద్రబాబునాయుడు సమీక్షలు దూరంగా ఉంటున్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొన్న నిర్ణయాలను టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్  సమీక్షలు నిర్వహించడాన్ని ఈసీ ఎందుకు తప్పుబట్టడం లేదని  బాబు స్వయంగా ప్రశ్నించారు.

ఎన్నికల కోడ్ కారణంగా  అసలైన అధికారం సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం చేతుల్లో కేంద్రీకృతమైంది. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండే ఈసీ వ్యూహత్మకంగా వ్యవహరించింది. వైసీపీ ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకొంది. శ్రీకాకుళం, కడప, ప్రకాశం జిల్లాల ఎస్పీలను బదిలీచేసింది. ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును కూడ బదిలీ చేసింది.

ఈ పరిణామాలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఫిర్యాదులపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పాలన వ్యవస్థ అంతా కూడ అధికారుల చేతుల్లోకి వెళ్తుందని  నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో రాజకీయ నేతల చేతుల్లో అధికారులు ఉండవని చెబుతున్నారు.

చంద్రబాబునాయుడు అపద్ధర్మ సీఎం కాకపోయినా ఈ సమయంలో  అధికారులు ఆయనకు ఉండవనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.ఇదే విషయాన్ని  ఎల్వీ సుబ్రమణ్యం ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

రాజ్యాంగం ప్రకారంగా  ముఖ్యమంత్రి పదవీ కాలం ఐదేళ్లు. అయితే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే పాత పాలనకు తెరపడినట్టేనని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సీఎం సమీక్షలు నిర్వహించడం సరైందికాదని  వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తే ఈసీ ఎందుకు తప్పుపట్టడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈసీకి ఎక్కడైనా ఒకే రకమైన రూల్స్ ఉంటాయనే వాదనను టీడీపీ నేతలు ముందుకు తెస్తున్నారు.

చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశాలకు ఎల్వీ సుబ్రమణ్యానికి సమాచారం రాలేదు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున సమీక్ష సమావేశాలను తాను హాజరుకాలేనని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సీఎంఓ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.

అత్యవసర సమయాల్లో  సీఎం సమీక్షలు నిర్వహించే వెసులుబాటు ఉంటుంది.. అయితే  అది కూడ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే పనిచేయాల్సిన అవసరం నెలకొందనే  అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

తనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను రాజకీయపరమైనవిగానే చూడాల్సిన అవసరం ఉందని  ఎల్వీసుబ్రమణ్యం అభిప్రాయపడుతున్నారు. టీడీపీ సర్కార్ చేపటటిన సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగిస్తామని ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు.

మరో వైపు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడ అధికారాలు లేనట్టేనని చెప్పడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం రిటైరైనట్టేనా అని ప్రశ్నిస్తున్నారు. 

ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా నెల రోజుల సమయం పట్టనుంది. ఎన్నికల ఫలితాల తర్వాత  ఏపీకి ఎవరు కొత్త ముఖ్యమంత్రి అనే విషయం తేలనుంది. ఫలితాల ప్రకటన వచ్చే వరకు ఏపీలో సీఎస్ సుబ్రమణ్యం  చేతిలోనే పాలన పగ్గాలు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 


 

click me!