
అమరావతి:కళ్యాణమస్తు కార్యక్రమం కోసం స్వామి వారి బంగారాన్ని ముంబైకి తరలించి 40 శాతం తరుగు చూపించిన చరిత్ర మాజీ టిటిడి ప్రధాన అర్చకుడు రమణదీక్షితులకు ఉందని ఏపీ
రాష్ట్ర బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ వేమూరి ఆనంద్ సూర్య చెప్పారు. టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై ఏపీ రాష్ట్ర బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ వేమూరి ఆనంద సూర్య
సంచలన ఆరోపణలు చేశారు.
శుక్రవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.ఈ వ్యవహరంలో అప్పటి టిటిడి ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. అర్చకులను రమణ
దీక్షితులు వేధింపులకు గురి చేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అర్దరాత్రి, మధ్యాహ్నం డ్యూటీలతో అర్చకులను రమణ దీక్షితులు వేధించిన విషయం వాస్తవం కాదా
అని ఆయన ప్రశ్నించారు.
సంపంగి ప్రాకారంలోని వంటశాలలో నైవేద్యం చేయవచ్చని ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణదీక్షితులు లేఖ ఇవ్వలేదా అని అనంద్ సూర్య ప్రశ్నించారు. పొట్ట నింపుకోవడం కోసం
అన్యమతస్థుడైనా జగన్ ఇంటికే వెళ్ళాలా అని ఆయన రమణదీక్షితులను ప్రశ్నించారు.
రమణ దీక్షితులుపై చర్యలు తీసుకొంటాం: టిటిడి ఛైర్మెన్
భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై న్యాయ పరమైన చర్యలు తీసుకొంటామని టిటిడి ఛైర్మెన్ పుట్టా సుధాకర్
యాదవ్ చెప్పారు. శుక్రవారం నాడు ఆయన తిరుపతిలో మీడియాలో మాట్లాడారు. 24 ఏళ్ళ పాటు టిటిడిలో అర్చకుడిగా పనిచేసి ఇవాళ దేవాలయంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఏమైనా సమస్యలుంటే టిటిడి పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. రోజుకో చోట ప్రెస్‌మీట్లు పెట్టి దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదన్నారు. బిజెపి
జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌లను రమణ దీక్షితులు కలవడం మంచి పద్దతి కాదన్నారు.