ఏపీలో వేడెక్కిన రాజకీయాలు... ముద్రగడతో సోము వీర్రాజు భేటీ

By Arun Kumar PFirst Published Jan 16, 2021, 12:38 PM IST
Highlights

 కాపు ఉద్యమ నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో రాష్ట్ర బీజేపీ నాయకులు సోము వీర్రాజు భేటీ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపిల మధ్యే రాజకీయాలు రంజుగా సాగుతుండగా తాజాగా బిజెపి కూడా రంగంలోకి దిగి దూకుడు పెంచింది. ముఖ్యంగా రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన కాపులను ఎక్కువగా ఆకర్షిస్తోంది బిజెపి. ఈ నేపథ్యంలోనే తాజాగా కాపు ఉద్యమ నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో రాష్ట్ర బీజేపీ నాయకులు సోము వీర్రాజు భేటీ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది.  

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడతో సోము వీర్రాజు సమావేశమయ్యారు. ఈ భేటి అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మార్పులను, తాజా పరిస్థితులపైనే తామిద్దరం చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు మార్పులు కోరుకుంటున్నారని... ఈ నేపథ్యంలో జనసేన, బిజెపి కలిసి పనిచేయడం జరిగుతుందన్నారు. తన అభిప్రాయాలను ముద్రగడకు తెలియజేశానని వీర్రాజు పేర్కొన్నారు.

మరోవైపు ఉత్తరాంధ్రలో టీడీపీ ముఖ్యనేతగా ఉన్న ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌తో బీజేపీ నేతలు మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబుతో పాటు జిల్లా నేతలకు కూడా అందుబాటులో ఉండటంలేదు. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని తనకంటే జూనియర్‌ అయిన అచ్చెన్నాయుడుకి అప్పగించడం పట్ల కళా వెంకట్రావ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వర్గీయుల ద్వారా తెలుస్తోంది. 

ఈ పరిణామాలను గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రానున్న రెండు మూడు రోజుల్లో  ఆయన్ను కలిసి పార్టీలోకి  ఆహ్వానిస్తారని చర్చసాగుతోంది. ఆయనతో పాటు పలువురు టీడీపీ అసంతృప్త నేతల్ని కూడా బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇప్పటికే ఉత్తరాంధ్రలో బాగా దెబ్బతిన్న టీడీపీకి కళా వెంకట్రావ్‌ రూపంలో భారీ షాక్‌ ఎదురవ్వబోతోందని సమాచారం. 

click me!