చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే: జగన్ తీరుపై గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Sep 28, 2019, 3:49 PM IST
Highlights

జగన్ పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు ఇసుక పాలసీకి సెప్టెంబర్ 5 అని ముహూర్తం పెట్టారని అది దాటి పోయినా ఇప్పటికీ ఇసుక దొరకడం లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పొరుగు రాష్ట్రాలకు దొరుకుతుంది కానీ రాష్ట్రప్రజలకు మాత్రం దొరకడం లేదన్నారు. 
 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై గవర్నర్‌ బీబీ హరిచందన్‌ను కలిశారు కన్నా లక్ష్మీనారాయణ.  

రాష్ట్రంలో ఇసుక కొరత ప్రజలను వేధిస్తోందని, ఆలయ భూముల పరిరక్షణ, గ్రామ సచివాలయ పరీక్షలు వంటి అంశాలపై గవర్నర్ బీబీ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

ఇసుక కొరతతో లక్షలాది కార్మికులు బజారున పడ్డా సీఎం జగన్ లో చలనం లేదని విరుచుకుడ్డారు. ఇసుక బ్లాక్ లో దొరుకుతుంది తప్ప సామాన్యులకు దొరకడం లేదన్నారు. జగన్ పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు ఇసుక పాలసీకి సెప్టెంబర్ 5 అని ముహూర్తం పెట్టారని అది దాటి పోయినా ఇప్పటికీ ఇసుక దొరకడం లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పొరుగు రాష్ట్రాలకు దొరుకుతుంది కానీ రాష్ట్రప్రజలకు మాత్రం దొరకడం లేదన్నారు. 

జగన్‌ మాటలకు చేతలకు పొంతన లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని అనుకున్నామని అయితే అప్రజాస్వామిక విధానాలపై వంద రోజుల్లోపే బయటకు రావాల్సిన పరిస్థితిని జగన్ ప్రభుత్వం కల్పించదని చెప్పుకొచ్చారు. 

సచివాలయ ఉద్యోగాల భర్తీ అపహాస్యంగా మారిందని చెప్పుకొచ్చారు. పేపర్ లీకైందని ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వం దానిపై సమగ్ర వివరణ ఇవ్వడం లేదని తిట్టిపోశారు. ఇకపోతే ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. 

ఆ రిజర్వేషన్లను సచివాలయ ఉద్యోగాల భర్తీలో పట్టించుకోలేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని లేనిపక్షంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు.  రాష్ట్రంలో ఎన్నోసమస్యలు ఉన్నా జగన్ మాత్రం స్పందించడం లేదన్నారు. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుంది సీఎం తీరని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. 

 

click me!