జనసేనపై సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్.. పొత్తు లేనట్టే? ‘ప్రజల్ని రోడ్లపై విడిచిపెట్టే వారితో పొత్తు లేదు’

By Mahesh KFirst Published Feb 4, 2023, 5:27 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. కలిసి వస్తేనే జనసేనతో పొత్తు ఉంటుందని, లేదంటే జనంతోనే తమ పొత్తు అని అన్నారు. టీడీపీ చేరువ అవుతున్న పవన్ కళ్యాణ్‌నూ దూరం పెట్టడానికి బీజేపీ సిద్ధం అవుతున్నట్టు ఈ వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి.
 

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అని మొదటి నుంచి చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అవసరమైతే టీడీపీ, బీజేపీలను ఏక తాటి మీదికి తెస్తా అని అన్నారు. కొన్నాళ్లు టీడీపీ, బీజేపీలకు సమాన దూరం పాటించాడు. కానీ, క్రమంగా టీడీపీ వైపు మొగ్గినట్టు ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉండగా బీజేపీ కూడా పవన్ కళ్యాణ్‌ పార్టీ జనసేనతోనే పొత్తు పెట్టుకుంటామని ఏపీలో సోము వీర్రాజు పలుమార్లు తెలిపారు. కానీ, టీడీపీతో కలిసేది లేదు అన్నట్టుగానే వ్యవహరించారు. ఈ రెంటినీ ఒక్కచోటికి చేరుస్తానని చెబుతూ టీడీపీ వైపే పవన్ కళ్యాణ్ మొగ్గినట్టు తెలుస్తున్న తరుణంలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒంటరి పోరుకు మానసికంగా సిద్ధం అవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: వైఎస్ వివేకా హత్య జరిగిన రోజున బాబు కాల్ రికార్డులపై సీబీఐ విచారణ: కొడాలి నాని డిమాండ్

ఇటీవలే జగిత్యాల కొండగట్టు పర్యటన చేసినప్పుడు తాను బీజేపీతోనే ఉన్నా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ, ఏపీ బీజేపీలో మాత్రం ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. జనసేనతో పొత్తు విషయంలో డైలామాలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నది. గతంలో జనసేనతోనే పొత్తు ఉంటుందని ప్రకటన చేసిన సోము వీర్రాజు గొంతులో మార్పు కొట్టిచ్చినట్టు కనిపిస్తున్నది. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న ఆయన జనసేనతో పొత్తుపై మరోమారు నిష్కర్షగా స్పందించారు. కలిసి వస్తేనే జనసేనతో పొత్తు ఉంటుందని అన్నారు. లేదంటోనే జనంతోనే తమ పొత్తు అని వివరించారు. అంతేకాదు, జనసేన పైనా పరోక్షంగా విమర్శ కూడా చేశారు. ప్రజలను రోడ్లపై నిర్దాక్షిణ్యంగా వదిలి వేసే పార్టీలతో పొత్తు ఉండదంటూ వ్యాఖ్యానించారు. 

టీడీపీకి దగ్గరైన పవన్ కళ్యాణ్‌తో పొత్తు లేకపోవడమే ఉత్తమం అని ఏపీ బీజేపీ భావిస్తున్నట్టు అర్థం అవుతున్నది. పవన్ కళ్యాణ్ తీరుపై పార్టీలో అనుమానాలు మొదలైనట్టు తెలుస్తున్నది. అందుకే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒక వేళ కలిసి రాకున్నా ఒంటిగా వెళ్లడానికి సిద్ధంగా ఉంటామని, ఉండాలనే సంకేతాలను అటు పవన్ కళ్యాణ్ పార్టీకి, బీజేపీ కార్యకర్తలకూ ఇచ్చినట్టయింది.

click me!