హిందూ దేవాలయాలపై ఆగని దాడులు... అభయాంజనేయ విగ్రహాన్ని పెకిలించిన దుండగులు (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 23, 2020, 10:21 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై  దుండగులు దాడులు కొనసాగుతున్నాయి.

కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై  దుండగులు దాడులు కొనసాగుతున్నాయి. అంతర్వేది రధం దగ్దం మొదలు రాష్ట్రంలో ఏదో ఒకచోట దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసమైన ఘటనలు బయటపడుతూనే వున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలో అలాంటి దుర్ఘటనే చోటుచేసుకుంది. 

కర్నూల్ జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పేకలించారు. రాత్రి సమయంలో ఈ దారుణానికి దుండగులు ఒడిగట్టడా ఉదయం దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు పోలీసులు. 
 
ఈ ఘటన పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ  విషయం గురించి తెలుసుకున్న స్థానిక బిజెపి నాయకులు సంఘటనా ప్రదేశంలో  రోడ్డుపై బైఠాయించిన నిరసనకు దిగారు. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం కి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. దీంతో బిజెపి కార్యకర్తలు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

వీడియో

"

అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు నిన్న రాత్రి 11 గంటల 20 నిమిషాల సమయంలో లో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు. ఈ దేవాలయం మంత్రాలయం నుండి బెంగళూరు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ప్రతిష్టించారు. ఈ స్వామి వారిని స్థానికులు ,రైతులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ ప్రాంతంలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు.

కోరిన కోరికలు నెరవేర్చే ఇష్టదైవంగా అప్పటినుండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకునేవారు. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజు ఎక్కువమంది ఈ ప్రాంతానికి తరలి వచ్చి తమ ఆరోగ్య సంబంధిత బాధలు తొలగిపోవాలని మొక్కుకునే వారు. 

హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ ధ్వంసం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తుల ఆటలు కట్టించకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పత్తికొండ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రంగయ్య గౌడు ధ్వజ మెత్తారు. ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసే వరకు.. ఆందోళన విరమించి ప్రసక్తే లేదంటూ ప్రధాన రహదారిపై బైఠాయించారు. 

విషయం తెలుసుకుని జిల్లా నలుమూలల నుండి పత్తికొండ కు చేరుకునేందుకు బిజెపి ఆర్ఎస్ఎస్ నేతలు కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పత్తికొండ నియోజకవర్గం లోని మండలాలతో పాటు సమీప మండలాలు పోలీసు సిబ్బందిని సంఘటనా స్థలంలో  బందోబస్తు కు పోలీసు ఉన్నతాధికారులు తరలిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని డీఎస్పీ హెచ్చరించారు. మరోవైపు సాయంత్రం సమయానికల్లా నూతన విగ్రహాన్ని అదే స్థలంలో ఏర్పాటు చేయాలని స్థానికులు నియోజకవర్గ నేతలు తీర్మానించారు.

click me!