konaseema violence: మరో 18 మంది అరెస్ట్.. నిందితుల్లో ఒక మైనర్, 217కి చేరిన అరెస్ట్‌ల సంఖ్య

By Siva KodatiFirst Published Jun 22, 2022, 8:43 PM IST
Highlights

కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ గత నెల 24న జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం మరో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

కోనసీమ అల్లర్ల కేసులో (konaseema violence) మరో 18 మందిని బుధవారం అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ఒక మైనర్ కూడా వున్నాడు. వీరితో కలిపి అమలాపురం గొడవలకు (amalapuram violence) సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 217కి చేరింది. వీరిలో మొత్తం ఆరుగురు మైనర్లు వున్నారు. ఈ ఘటనల్లో 268 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు 7 బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే మొత్తం 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు పోలీసులు. 

కాగా.. కోనసీమ జిల్లా పేరు మార్పును (konaseema district) వ్యతిరేకిస్తూ గత నెల 24న జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అమలాపురంలో అల్లర్ల ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై కేసులు నమోదు చేస్తూ, అరెస్ట్‌లు చేస్తున్నారు. గతవారం ఈ కేసులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విశ్వరూప్ అనుచరులను.. A-225గా సత్యరుషి,  A-226గా సుభాష్, A-227గా మురళీకృష్ణ, A-228గా రఘులను చేర్చారు. A-222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. నలుగురు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ALso Read:అమలాపురం అలర్ల ఘటన.. మంత్రి విశ్వరూప్ అనుచరులపై కేసు నమోదు..!

ఇక, రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి (dgp rajendranath reddy) కూడా కోనసీమలో పర్యటించారు. గత నెలలో చోటుచేసుకున్న అల్లర్లలో ధ్వంసమైన మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌ ఇళ్లను, కలెక్టరేట్‌ ప్రాంతాన్ని డీజీపీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అమలాపురంలో జరిగిన హింసాత్మక ఘటనలో నిందితులుగా ఉన్న యువకులను కొంత మంది వ్యక్తులు తప్పుదారి పట్టించి, రెచ్చగొట్టారని చెప్పారు. అమలాపురంలో ఘర్షణలు జరగకుండా రాజకీయ పార్టీలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఘర్షణలు, హింసాకాండ ఘటనలపై సాంకేతిక పరిజ్ఞానంతో లభించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

ఈ అల్లర్లకు సంబంధించి ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, ఇప్పటివరకు 258 మంది నిందితులను గుర్తించగా.. వారిలో 142 మందిని అరెస్టు చేశామని, మరో 116 మంది కోసం ఏడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీజీపీ చెప్పారు. నిందితులందరి పేర్లపై రౌడీషీట్లు తెరుస్తామని తెలిపారు. “సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఘర్షణల సమయంలో నివేదించబడిన నష్టానికి సంబంధించిన ఆర్థిక బాధ్యతను పరిశీలించడానికి న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించనుంది. నిందితులు నష్టానికి రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది’’ అని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 

click me!