పవన్‌ను కాదని అనితకు హోం శాఖ... ఎందుకో తెలుసా..?

By Galam Venkata Rao  |  First Published Jun 14, 2024, 10:22 PM IST

Home Minister Vangalapudi Anitha: వంగలపూడి అనిత. టీచర్ నుంచి హోం మినిస్టర్ స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం ఎందరో మహిళలకు ఆదర్శం. ఆడబిడ్డల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న అనిత... ఈ స్థాయికి ఎలా ఎదిగారో తెలుసా...??


Home Minister Vangalapudi Anitha: ఆమె ఓ సాధారణ ఉపాధ్యాయురాలు. ప్రజలు.. ముఖ్యంగా మహిళలకు ఏదైనా మంచి చేయాలన్న తపనతో ఉపాధ్యాయ వృత్తిని వదిలి... రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. సరిగ్గా పదేళ్ల క్రితం 2014లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఎన్నికై... నేడు ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కేటాయించడం ఖాయమనుకున్న హోం శాఖను ఆమెకు కేటాయించారు. ఆయన్ను కాదని ఆమెకే ఎందుకంటే...???

Latest Videos

వంగలపూడి అనిత.. ఒకప్పుడు టీచర్‌. ఇప్పుడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి హోం మంత్రి. టీచర్‌గా ఎంతో మంది పిల్లలకు విద్యాబుద్దులు నేర్పిన ఆమె అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన 2014లో పాయకరావుపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, ఎన్నికల్లో ఓడిపోయినా.. తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు అనిత. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేశారు. మహిళలు, యువతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో అనేక విధాలుగా వేధింపులకు గురయ్యారు. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులను దారుణంగా ట్రోల్‌ చేసిన తీరుతో ఆమె నిద్ర లేని రాత్రులు గడిపారట. 

గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలోని మహిళలతో పాటు ఉత్తరాంధ్ర సమస్యలపై వంగలపూడి అనిత గళం వినిపించారు. బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటం చేశారు. నిషేధాలు విధించినా బెణకకుండా ముందుకు సాగారు. మాజీ ఎమ్మెల్యేగా కారులో వెళ్తే పోలీసులు ఆపేస్తున్నారన్న కారణంతో స్కూటీపై వెళ్లి బాధితులను పరామర్శించిన సందర్భాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

అధికార పార్టీ ఎన్ని దాడులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా కౌంటర్లు ఇచ్చారు. పార్టీనే నమ్ముకొని పనిచేశారు. పార్టీ అధిష్టానం గీసిన గీత దాటకుండా గత ప్రభుత్వ విధానాలపై తనదైన శైలిలో పోరాడారు. మంత్రులు, వైసీపీ నేతల ఘాటు విమర్శలకు దీటుగా బదులిచ్చారు. అలా టీడీపీ అధిష్టానం వద్ద మంచి మార్కులు సంపాదించుకున్నారు అనిత. అలాగే, పార్టీలో ఫైర్‌ బ్రాండ్‌ అన్న ముద్ర కూడా వేయించుకున్నారు. 

హోం మంత్రి పదవే ఎందుకు..???
వంగలపూడి అనితకు హోం మంత్రి పదవి కట్టబెట్టడం బలమైన కారణాలున్నాయని చెప్పవచ్చు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మమైన అడుగులు వేశారు. పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోం శాఖ కేటాయిస్తారన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే, చంద్రబాబు మాత్రం ఈ విషయంలో తెలివిగా వ్యవహరించారంటున్నారు విశ్లేషకులు. గత ప్రభుత్వం రెండు సార్లు ఎస్సీ సామాజికవర్గం, అందులోనూ మహిళకే హోం శాఖను కట్టబెట్టింది. తొలి దఫాలో మేకతోటి సుచరిత, రెండోసారి తానేటి వనితకు జగన్‌ తన కేబినెట్‌లో హోం మినిస్టర్‌గా పదవీ బాధ్యతలు అప్పగించారు. సేమ్‌ టూ సేమ్‌ చంద్రబాబు కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. సుచరిత, వనితల సామాజిక వర్గానికి చెందిన మహిళనే హోం మంత్రి చేశారు. ఉన్నవారిలోకెలా ఫైర్‌ బ్రాండ్‌ నాయకురాలు వంగలపూడి అనితేనన్న ముద్ర పడటం కూడా కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే, పోరాడే నాయకురాలని పేరు తెచ్చుకున్న అనితకు తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకులు ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. 

తాజాగా హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత మీడియాతో మాట్లాడుతూ.. కీలక విషయాలు చెప్పారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఆడవాళ్లపై అఘాయిత్యం చేయాలనుకునేవారు భయపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం మోపుతానని స్పష్పం చేశారు. ఆడబిడ్డల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా తన శాఖలోని పోలీసుల వేతనాలు, వేతన బకాయిలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు....

Vangalapudi Anitha Biography: ఆమె ఉన్నత విద్యావంతురాలు, పైగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కానీ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను చేసే గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఉన్నత ఆశయాతో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. నేడు ఆ పార్టీకే ఆమె గొంతుగా మారారు. ఆమెనే  విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం.. 

బాల్యం, విద్యాభాస్యం: 
వంగలపూడి అనిత .. 1979 జనవరి 1న విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో వంగలపూడి అప్పారావు గారి దంపతులకు జన్మించారు. అనిత తండ్రి అప్పారావు గారు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్. అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చిన్న వయస్సులోనే ప్రభుత్వం టీచర్ గా ఉద్యోగం రావడంతో  ఉద్యోగం చేస్తూనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెంట్ కోర్సులో ఎంఎస్సీ పూర్తి చేశారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎం.ఈ.డి  పూర్తి చేశారు.

ఆమె దాదాపు 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులపై స్థానిక నేతలను ప్రశ్నించేది. రాజకీయాలపై ఆసక్తితో 34 సంవత్సరాల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా రాజీనామా చేసి రాజకీయాలు అడుగు పెట్టారు. అనిత డిగ్రీలో ఉండగానే వాళ్ళ అన్నయ్య గారికి స్నేహితుడైన కొసర శివప్రసాద్ పరిచయం కావడం అది ప్రేమగా మారడం పెద్దలను ఎదిరించి పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒక కేసులు పెట్టుకొని ఆ తర్వాత డైవర్స్ కూడా అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె.

రాజకీయ ప్రవేశం 
2012లో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన అనిత. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు.  తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమెను ప్రోత్సహించారు. అలా 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు.  ఆ ఎన్నికల్లో సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెంగల వెంకటరావు పై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టింది.

>> ఆమె 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది. అయితే.. తన మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో అనవసర వివాదాలు ఆస్కారం ఇవ్వకుండా ఆవిడ.. చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పదవి తనకు వద్దని సునితంగా ఆ సమస్యను పరిష్కరించారు. 

>> 2017లో అనితకి, వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో సంచలనమైంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా..అనితను ఉద్దేశిస్తూ..  నేనేమీ నీలా మొగును కొట్టి పోలీస్ స్టేషన్కు వెళ్లలేదని వివాదా కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలతో అనిత కన్నీటి పర్యంతమైంది. ఈ నేపథ్యంలో రోజాపై సస్పెన్షన్ వేయాలని అప్పటి సభాపతి కోడెల శివప్రసాదరావు గారిని అడగడం. దానిపై స్పందించిన సభాపతి.. రోజాను  సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో ఈ  ఘటన సంచలనం సృష్టించింది.

>> ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కారణంగా చంద్రబాబు గారు పాయకరావుపేట నుంచి కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనితను ఆదేశించారు. అధినేత ఆదేశాన్ని పాటించిన ఆమె. కొవ్వూర్ నుంచి పోటీ చేసి 25,248 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసిపి ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించగా తెలుగుదేశం కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది.

>> ఇక 2021 జనవరి 30న ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనిత నియమించారు. చంద్రబాబు తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ గొంతుని ఎలుగెత్తి చాటుతూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. 

>> 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై 43వేల 737 పైచిలుకు ఓట్ల మెజారిటీ తో గెలిచారు.

click me!