Latest Videos

నా వయసు చిన్నదే.. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు- జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

By Galam Venkata RaoFirst Published Jun 14, 2024, 6:53 PM IST
Highlights

త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు. పార్లమెంటు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వయసు చిన్నదేనని... తనలో సత్తువ ఇంకా తగ్గలేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం వైసీపీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో జగన్‌ మాట్లాడారు. ఏపీలోని ప్రతి ఇంట్లో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి ఉంద‌ని.... ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం సన్నగిల్లకూడద‌ని దిశానిర్దేశం చేశారు. పోరాటపటిమ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదన్నారు. గతంలో 14 నెలలు పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. ఇంకా పోరాటాలు చేసే శక్తి ఉంద‌ని... ప్రజలు మళ్లీ అధికారంలోకి తీసుకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై వైసీపీ ఎంపీలకు జగన్ మార్గనిర్దేశం చేశారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపైనా చర్చించారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలపైనా చర్చించారు.   

పార్లమెంటులో వైసీపీ 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. మొత్తంగా 15 మంది ఎంపీలు వైసీపీకి ఉన్నారు. టీడీపీ రాజ్యసభలో ఖాళీ అవగా... ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో లోక్‌సభలో టీడీపీ బలం 16కి చేరింది. కాబట్టి వైసీపీ కూడా చాలా బలమైందేనని... తమను ఎవరూ ఏమీ చేయలేరని ఆ పార్టీ అధినేత జగన్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా హితమే లక్ష్యంగా పార్లమెంటులో వ్యవహరించాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలన్నారు. రాజకీయంగా ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమని... తమ పరిపాలనను, చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారని ఎంపీల సమావేశంలో జగన్‌ చెప్పుకొచ్చారు. కచ్చితంగా తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం ఉందన్నారు.

కాగా, రాజ్యసభలో వైసీపీ నేతగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని, లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని జగన్‌ తెలిపారు. తాను అందరికీ అందుబాటులో ఉంటానని... ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని అడుగులు ముందుకేయాలని కోరారు. పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎంపీలు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేలా ఉండాలన్నారు. 

click me!