సెలవులో ధర్మారెడ్డి.. టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్, బాధ్యతల స్వీకరణ

By Siva KodatiFirst Published Dec 23, 2022, 5:46 PM IST
Highlights

టీటీడీ ఇన్‌ఛార్జ్‌ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తన కుమారుడు చంద్రమౌళి రెడ్డి గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవులో వున్న సంగతి తెలిసిందే. 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇన్‌ఛార్జ్ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం శ్రీవారి బంగారు వాకిలి వద్ద సింఘాల్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. 12 రోజుల పాటు సింఘాల్ టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా విధులు నిర్వర్తించనున్నారు. తన కుమారుడు చంద్రమౌళి రెడ్డి గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవులో వున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనిల్ కుమార్ సింఘాల్‌కు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 

కాగా... ఇటీవల గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన చంద్రమౌళి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ధర్మారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక, చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. అలాగే సివిల్స్ పరీక్షలకు కూడా సిద్దం అవుతున్నాడు. ఇటీవలే చంద్రమౌళి రెడ్డి చెన్నై పారిశ్రామికవేత్త ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమయింది. వచ్చే నెల వీరి వివాహం జరగాల్సి ఉంది. 

ALso REad: టీటీడీ ఈవో దర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూత.. వచ్చే నెలలో పెళ్లి.. ఇంతలోనే తీవ్ర విషాదం..

చెన్నైలోని ఆళ్వారుపేటలో బంధువులకు పెళ్లిపత్రికలు ఇవ్వడానికి వెళ్లిన సమయంలోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో అతనితో పాటు ఉన్న స్నేహితుడు నేరుగా కావేరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రమౌళి రెడ్డి తుదిశ్వాస విడిచారు. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా.. చంద్రమౌళి రెడ్డి ఇలా కన్నుమూయడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

‘‘టీటీడీ ఈవో ధర్మారెడ్డి  కుమారుడు చంద్రమౌళి రెడ్డి  ఈనెల 18న గుండెపోటుతో అల్వార్‌పేటలోని  కావేరి ఆస్పత్రిలో చేరారు. ఆయనను ఆరోగ్యం మెరుగుపరచడానికి వైద్యుల బృందం తీవ్రంగా శ్రమించింది. అయితే లాభం లేకుండా పోయింది. డిసెంబర్ 21వ తేదీ ఉదయం  8.20 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ముందుగా చేసిన వాగ్దానం ప్రకారం.. కళ్లను డోనెట్ చేయడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి’’అని కావేరి హాస్పిటల్‌లో ప్రకటనలో తెలిపింది. 

click me!