ఆ జిల్లా ఎస్పీకి ఎంత ధైర్యం ?

First Published Nov 30, 2017, 3:07 PM IST
Highlights
  • తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పెద్ద సాహసమే చేశారు

తూర్పుగోదావ‌రి జిల్లాలో అన్నీ మూరుమూలల్లో ఉండే గిరిజన తండాలు. అక్కడికి వెళ్లాలంటే రోడ్లు ఉండవు. రాళ్లు, రప్పలు, వాగులు దాటుకుంటూ వెళ్ళాల్సిందే.  ఇక వారికి విద్య, వైద్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆ గ్రామాలకు రోడ్డు సౌకర్యం వస్తే చాలు చాలా సౌకర్యాలు అమరినట్లే.  అదే విషయాన్ని ప్రజాప్రతినిధులకు, అధికారులకు దశాబ్దాలుగా ఆదివాసీలు మొరపెట్టుకుంటూనే ఉన్నా ఉపయోగం కనబడలేదు. విచిత్రమేమిటంటే, గిరిజనుల సౌకర్యార్ధం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తోంది. అవి ఖర్చు కూడా అవుతున్నాయి. కానీ  క్షేత్రస్ధాయిలో సౌకర్యాలేవీ కనబడవు. అందుకే మూరుమూలనున్న గిరిజన తండాలు నేటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి.

 

అటువంటి వేలాది గ్రామాల్లో తూర్పుగోదావ‌రిజిల్లా ఎట‌పాక మండ‌లంలోని జ‌గ్గారం గ్రామం కూడా ఒకటి. ఆ గ్రామంలో చ‌త్తీస్‌ఘ‌డ్ నుండి వ‌ల‌స వ‌చ్చిన ఆదివాసీలు నివ‌సిస్తున్నారు. ఆ గ్రామానికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. మొత్తం ఆ గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నాయి. వారి జీవ‌న విధానం చాల దుర్భరం. వారికి నాగ‌రిక‌త‌తో ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఇది మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతం. దాంతో అధికారుల్లో చాలామంది అటువైపు కన్నెత్తి కూడా చూడరు. అదే సమయంలో వీరూ భ‌య‌స్తులవటంతో నాగరీకులతో కలవటానికి ఇష్టపడరు.

కోళ్ళు, మేక‌ల‌ను పెంచుకుంటూ , అడ‌విలో దొరికే కుంకుడు వ‌గైరాల సేకరణే జీవనాధారం. వారానికి ఒక‌సారి స‌మీపంలోని చింతూరు సంత‌లో  అమ్ముకుంటారు. ఈ నేపధ్యంలోనే జిల్లాకు ఎస్‌.పి గా వచ్చిన విశాల్ గున్ని వారి గురించి తెలుసుకున్నారు. వారి గ్రామానికి ఏదైన సాయం చేయాలనుకున్నారు. వారి అవసరాలేంటో తెలుసుకున్నారు. ప్రాధమికావసరమైన విద్యుత్ పై ఎస్పీ దృష్టి పెట్టారు.

రాజు తలచుకుంటే దేనికి కొదవ? అనుకున్నదే తడవుగా క‌ష్టమైనా సరే  త‌న సిబ్బందితో  అక్క‌డకు చేరుకున్నారు.  జగ్గారంలో సోలార్ ప‌వ‌ర్‌ప్లాంట్ ఏర్పాటు చేశారు.  ప్ర‌తి ఇంటికి క‌రెంట్ వచ్చేట్లు చేసారు. ఇంటికి రెండు బ‌ల్బులు, క‌రెంట్ ప్ల‌గ్, సాకెట్ త‌దిత‌ర విద్యుత్ సామాగ్రి ఏర్పాటు చేసారు. అదే సమయంలో క‌లెక్ట‌ర్ తో మాట్లాడి వారికి కావ‌సిన నీటి సౌకర్యం, రోడ్లు, రేష‌న్‌కార్డుల‌ ఏర్పాటుకు  కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  మైదాన ప్రాంతం వారంటే ఉండే భయాన్ని పోగొట్టటానికి వారితో ఒక రోజంతా ఉల్లాసంగా గ‌డిపారు. వారితో స‌హ‌పంక్తి భోజ‌నం కూడా చేసారు. ప్రతీ అధికారి గున్నీ లాగే క్షేత్రస్ధాయిలో పర్యటిస్తే చాలా వరకూ సమస్యలు పరిష్కారమవుతాయి.

 

click me!