కూరగాయలమ్మే ఈ అవ్వే సివిల్స్ ర్యాంకర్ ను తీర్చిదిద్దింది... .ఓ తెలుగుతేజం విజయగాధ 

By Arun Kumar PFirst Published Apr 17, 2024, 6:29 PM IST
Highlights

అతడికి కష్టాలు కొత్తేమీ కాదు... అందుకే మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి మరికొన్ని రోజులు కష్టాలు పడ్డాడు. దాని ఫలితమే ప్రస్తుతం సాధించిన సివిల్స్ ర్యాంక్. ఇలా సివిల్స్ సాధించిన ఓ తెలుగుతేజం విజయగాధ ఇది...  

ప్రకాశం : ఎంతో కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అంతటితో అతడి జీవితంలో కష్టాలు తీరిపోయాయని అందరూ భావించారు. కానీ అతడు మాత్రం తన పెద్ద కలను సాధించడానికి ఈ చిన్న ఉద్యోగం సరిపోదని భావించి పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ కష్టాలను కొనితెచ్చుకున్నాడు. కానీ ఈ కష్టాలు అతడికి కొత్తవేమీ కాదు... చిన్నప్పటి నుండి అనుభవిస్తున్నవే... కానీ ఈ కష్టాలు దాటితే తన జీవితమంతా సుఖమే వుంటుందని అతడికి తెలుసు. అందుకే ఎన్నో కష్టకష్టాలు, అవమానాలు భరించి ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు కానిస్టేబుల్ నుండి సివిల్ ర్యాంకర్ స్థాయికి చేరుకున్నాడు. అతడి విజయగాధ ఇలా సాగింది... 

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డిది పేద కుటుంబం. అతడి చిన్నపుడే తల్లి జయమ్మ, ఇంటర్మీడియట్ చదివే సమయంలో తండ్రి శ్రీనివాసులు రెడ్డి చనిపోయారు. దీంతో అతడికి తల్లీ తండ్రి తానే అయి చూసుకుంటోంది నాన్నమ్మ రమణమ్మ. ఆర్థికంగా ఇబ్బందులున్నా ఉదయ్ తో పాటు అతడి సోదరుడిని కూడా బాగా చదివించింది నాన్నమ్మ. ఎందుకంటే ఆమెకు తెలుసు... మనవళ్ల చదువే వారిని ఈ పేదరికం నుండి బయటపడేయడంతో పాటు సమాజంలో గౌరవాన్ని ఇస్తుందని.  అందువల్లే తాను ఎంతో కష్టపడి కూరగాయలు అమ్ముతూ మనవళ్లను ప్రయోజకులను చేసింది.  

నాన్నమ్మ కష్టాన్ని చూసి పెరిగాడు కాబట్టి ఉదయ్ కూడా బుద్దిగా చదువుకునేవాడు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలోనే అయినా శ్రద్దగా చదువుకుని మంచి మార్కులు సాధించేవాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలోనే 2013 లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడటంతో ప్రిపేర్ అయ్యారు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందాడు. 

ఆ అవమానమే ఉదయ్ ని సివిల్స్ వైపు నడిపించింది... 

2013 లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరిన ఉదయ్ కు ఆ జాబ్ పై అంత ఆసక్తి లేదు. ఇంకా పెద్దగా ఏదైనా సాధించాలని వుండేది. కానీ కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి సర్దుకుపోయాడు. కానీ 2018 లో తన ఉన్నతాధికారి చేసిన అవమానం అతడిలో కసిని పెంచింది. ఇక ఈ అవమానాలను భరిస్తూ ఆత్మగౌరవాన్ని చంపుకుని కానిస్టేబుల్ గా కొనసాగలేకపోయాడు. వెంటనే ఆ జాబ్ కు రాజీనామా చేసి సివిల్స్ బాట పట్టారు. 

సివిల్స్ ర్యాంక్ అంత ఈజీగా రాలేదు... 

కానిస్టేబుల్ ఉద్యోగం చేసే సమయంలో కొంత డబ్బును దాచుకున్నాడు ఉదయ్... రిజైన్ చేసాక ఆ డబ్బులే ఎంతగానో ఉపయోగపడ్డాయి. హైదరాబాద్ కు వెళ్ళి కోచింగ్ తీసుకోవడాని ఈ డబ్బులే ఉపయోగపడ్డాయి. ఇలా ఉద్యోగాన్ని వదులుకుని సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించిన అతడిని విధి మళ్లీ పరీక్షించడం ప్రారంభించింది. ఎంత బాగా చదివినా మూడుసార్లు సివిల్స్ సాధించలేకపోయాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తన బలహీనతలను అధిగమిస్తూ నాలుగోసారి చాలా బాగా ప్రిపేర్ అయ్యాడు. 

ఎంతగొప్ప విజయం తల్లీ ... సివిల్స్ ర్యాంకర్ అనన్య పేరెంట్స్ కళ్లలో ఆనందం చూడండి

ప్రిలిమ్స్, మెయిన్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసి ఇంటర్వ్యూను కూడా చాలాబాగా ఎదుర్కొన్నాడు. దీంతో ఈసారి అతడిని విజయం వరించింది. నిన్న(మంగళవారం) వెలువడిని యూపిఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఉదయ్ కృష్ణారెడ్డి 780వ ర్యాంకు సాధించాడు.  ప్రస్తుతం వచ్చిన ర్యాంకుతో ఐఆర్ఎస్ వస్తుందని... కానీ ఐఎఎస్ సాధించడమే తన లక్ష్యమని ఉదయ్ చెబుతున్నాడు. ఇప్పటికయితే ఐఆర్ఎస్ లో చేరి ఐఎఎస్ కోసం ప్రయత్నిస్తానని ఉదయ్ వెల్లడించాడు. నాన్నమ్మ కష్టం, సీఐ చేసిన అవమానం, తన ఆత్మవిశ్వాసమే తన సివిల్స్ లో ర్యాంక్ సాధించడానికి కారణమని మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డి వెల్లడించాడు. 

click me!