ఏసియానెట్ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే : జగన్ పథకాలు బాగున్నాయ్.. కానీ చంద్రబాబే సీఎం కావాలి

By Arun Kumar PFirst Published Apr 15, 2024, 6:00 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్  లో అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గెలుపు తమదంటే తమదంటూ వైసిపితో పాటు టిడిపి, జనసేన కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మూడ్ ఎలా వుంది..? తెలుసుకోవాలంటే ఏసియా నెట్ న్యూస్ సర్వే ఫలితాలు చూడాల్సిందే...

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బిజిపి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతోంటే... అధికార వైసిపి ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ప్రధాన పార్టీలన్ని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసియా నెట్ న్యూస్ తెలుగు ఆన్ లైన్ సర్వే చేపట్టింది. వైసిపి, టిడిపి పాలనను, వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు పనితనాన్ని పోలుస్తూ తెలుగు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంది ఏషియా నెట్ తెలుగు. ప్రజల మూడ్ ను తెలుసుకునేలా 'మూడ్ ఆఫ్  ఆంధ్ర ప్రదేశ్' సర్వే సాగింది. సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంది ఏషియానెట్ న్యూస్ తెలుగు. సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఏమాత్రం వక్రీకరించకుండా యథాతథంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.

స్థూలంగా ఏసియా నెట్ తెలుగు మూడ్ ఆప్ ఆంధ్రప్రదేశ్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే.. ఎక్కువ మంది ఉచిత ఫథకాలకన్నా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డితో పోల్చితే చంద్రబాబు నాయుడిపై కాస్త ఎక్కువ విశ్వాసం కనిపిస్తోంది. మరోవైపు జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై మంచి సానుకూలత కనిపించింది. రాష్ట్రం అభివృద్ధి చెందాంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

గత అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన వైసిపికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అగ్నిపరీక్ష తప్పేలాలేదు. వైసిపి ప్రభుత్వం గత ఐదేళ్ళ పాలనపై డైలమా నెలకొంది. జగన్ పాలన బాగుందని గానీ లేదా బాగాలేదని గానీ చెప్పడానకి లేకుండా ఏషియా నెట్ సర్వేలో అడిగిన ఓ ప్రశ్నకు ప్రజలు సమాధానం చెప్పారు.  గడిచిన ఐదేళ్లలో వైసిపి పాలన ఎలావుందని అడిగితే 39 శాతం బాగుందని... 40 శాతం మెరుగుపడాల్సిందని... 21 శాతం ఏమీ చెప్పలేమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. 

జగన్ సర్కార్ అనగానే ముందుగా గుర్తువచ్చేవి సంక్షేమ పథకాలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమా వైసిపిలో వుంది. మరి నిజంగానే రైతు భరోసా, అమ్మఒడి వంటి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ప్రభావం ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే  స్థాయిలో వుంటుందా? వీటి వల్ల వైసిపి లాభం వుంటుందా? అంటే అత్యధికుల నుండి అవుననే సమాధానం వస్తోంది. సంక్షేమ పథకాల అమలు ఈ ఎన్నికల్లో వైసిపికి మేలు చేస్తాయని 47 శాతం, చేయవని 41 శాతం, ఏమీ చెప్పలేమని  13 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సొంత చెల్లి షర్మిల ప్రత్యర్థిగా మారింది. ఏ కాంగ్రెస్ పార్టీ నుండి అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అదే పార్టీకి షర్మిల రాష్ట్రాధ్యక్షురాలు అయ్యారు. ఏపి కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన షర్మిల సొంత అన్నకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. తన తండ్రికి అసలైన వారసురాలిని తానే అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు షర్మిల. ఇప్పుడు ఏకంగా వైసిపి కంచుకోట కడపలోనే ఎంపీగా పోటీకి సిద్దమయ్యారు షర్మిల. మరి ఆమె రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయాలతో ఏపీలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఈ క్రమంలో షర్మిల పాలిటిక్స్ ఎవరికి కలిసి వస్తాయని ప్రజలను అడిగితే 41 శాతం మంది టిడిపి, జనసేన, బిజెపి కూటమికే అని అభిప్రాయపడ్డారు. ఇక వైసిపి లాభమని 20 శాతం అభిప్రాయం. విచిత్రంగా షర్మిల ప్రభావం ఎలా వుంటుందో చెప్పలేమని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ లో మొదట టిడిపి, తర్వాత వైసిపి ప్రభుత్వాలను ఏర్పాటుచేసారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు రెండు ప్రభుత్వాల హయాంలో పాలనను చూసారు... ఎవరి పాలన బాగుందో ఓ అభిప్రాయం ఏర్పడివుంటుంది. అందుకోసం రాష్ట్ర అభివృద్ది ఎవరి హయాంలో జరిగిందని అడిగితే అత్యధికులు టిడిపికే ఓటేసారు. టిడిపి హయాంలోనే రాష్ట్ర అభివృద్ది జరిగిందని 53 శాతం అభిప్రాయపడితే వైసిపికి కేవలం 38 శాతం మందే ఓటేసారు. ఇక ఎవరి హయాంలోనూ అభివృద్ది జరగలేదని 9 శాతం మంది తెలిపారు. 

ఇక కొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ వైసిపి గెలిస్తే మళ్లీ వైఎస్ జగన్ సీఎం అవుతారని ఎవరిని అడిగినా చెబుతారు. కాని ప్రతిపక్ష కూటమి విషయంలోనే ఈ క్లారిటీ కాస్త మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం పదవిని పంచుకుంటారన్న ఓ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని రాబోయే ఐదేళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుంటే బావుంటుందని ఏషియా నెట్ సర్వేలో ఓ ప్రశ్నను ప్రజలకు సంధించాం. ఇందుకు అత్యధికులు చంద్రబాబు వైపే నిలిచారు. చంద్రబాబుకు 47 శాతం మంది సీఎంగా కోరుకుంటే వైఎస్ జగన్ ను 42 శాతం కోరుకున్నారు. ఇక పవన్ కల్యాణ్ ను కేవలం 8 శాతం సీఎంగా కోరుకోగా... బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అసలు ఈ పోటీలోనే లేకుండా పోయారు. 

చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే, టిడిపి ప్రభుత్వం ఏర్పడితేని రాష్ట్ర అభివృద్ది సాధ్యమని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 36 శాతం మంది మాత్రం చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెట్టని రాష్ట్ర అభివృద్ది శూన్యమని అంటున్నారు. మరో 9 శాతం ఏమీ చెప్పలేమని అంటున్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి లు వేరువేరుగా పోటీ చేయడంతో వైసిపి లాభపడిందని... అందువల్లే ఇంతటి భారీ మెజారిటీతో గెలిచింది. వైసిపి బంపర్ మెజారిటీ సాధించడంతో ఇదే కారణం కాకున్నా ఇది కూడా ఓ కారణమే. ఇది గుర్తించిన ప్రతిపక్షాలు ఈసారి జగన్ ను ఓడించేందుకు ఒక్కటయ్యాయి. అందరం కలిస్తే జగన్ ఓడించగలం అన్నది ఆ పార్టీల అభిప్రాయం... మరి ప్రజలు ప్రతిపక్షాలన్ని కలిసి పోటీచేయడం ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో ఏషియా నెట్ తెలుసుకుంది. జనసేన,  బిజెపిలతో జతకట్టడం  టిడిపికి కలిసివస్తుందని సర్వేలో పాల్గొన్న 52 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ప్రతిపక్షాల కూటమి వల్ల టిడిపి లాభం వుండదని 32 శాతం, ఏమీ చెప్పలేమని 16 శాతం అభిప్రాయం వ్యక్తమయ్యింది. 

వైసిపి పాలనలో కీలక రాజకీయ పరిణామాల్లో ముఖ్యమైనది మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్. టిడిపి హయాంలో అమలుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ లో పెద్ద స్కామ్ జరిగిందని... అందులో ప్రధాన పాత్ర ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునే అని ఆరోపిస్తూ ఆయనను అరెస్ట్ చేసింది వైసిపి ప్రభుత్వం. ఇలా చంద్రబాబును అరెస్ట్ చేసి చాలాకాలం జైల్లోపెట్టింది జగన్ సర్కార్. ఈ స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం,  చంద్రబాబు అరెస్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రభావం చూపుతుందా అంటే 44 శాతం అవునని, 41 శాతం కాదని, 16 శాతం ఏమీ చెప్పలేమని అభిప్రాయం వ్యక్తం చేసారు. 

ఇక గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వ తీసకున్న అతిపెద్ద నిర్ణయం మూడు రాజధానుల ఏర్పాటు. కేవలం అమరావతిని మాత్రమే కాకుండా మరో రెండు నగరాలు విశాఖపట్నం, కర్నూల్ లను కూడా రాజధానులుగా తీర్చిదిద్దుతామని వైసిపి ప్రకటించింది. ఇలా విశాఖను రాజధాని తరలింపు ఉత్తరాంధ్ర ఓటర్లను ప్రభావం చేస్తుందని... ఇది తమకెంతో కలిసి వస్తుందని వైసిపి భావిస్తోంది. కానీ ప్రజభిప్రాయం మాత్రం మరోలా వుంది. విశాఖకు రాజధాని తరలింపు అనేది ఈ ఎన్నికల్లో వైసిపికి ఏమాత్రం కలిసిరాదని సర్వేలో పాల్గొన్న 49 శాతం మంది అభిప్రాయపడ్డారు. వైసిపి ఈ నిర్ణయం లాభం వుండవచ్చని 38 శాతం, ఏమీ చెప్పలేమని 12 శాతం అభిప్రాయం. 

ప్రతిపక్షంలో వుండగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. అలాగే ఎన్నికల సమయంలోనూ నవరత్నాలు పేరిట మరికొన్ని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరతామని వైఎస్ జగన్ తెలిపారు. మరి ఆ హామీలన్నింటిని ఈ ఐదేళ్ల పాలనలో నెరవేర్చారా అని అడిగిలే లేదనే ఎక్కవమంది అభిప్రాయపడ్డారు. వైసిపి సర్కార్ హామీలను నెరవేర్చలేదని 50 శాతం, నెరవేర్చిందని 45 శాతం, ఏమీ చెప్పలేమని 5 శాతం అభిప్రాయపడ్డారు. 

వైఎస్ జగన్ హామీలు, ఒక్క చాన్స్ ఇవ్వాలన్న మాటలు నమ్మిన ఏపీ ప్రజలు భారీ మెజారిటీతో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. 175 అసెంబ్లీ సీట్లకుగాను 151 చోట్లలో వైసిపి గెలిచింది. ఈ విజయాన్ని వైసిపి నాయకులే నమ్మలేకపోయారు. అలాంటిది ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లు వైసిపికి వస్తాయా అని అడిగితే రావనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. గత ఎన్నికల కంటే ఈసారి వైసిపి సీట్లు మెరుగుపడే అవకాశమే లేదని 63 శాతం, సాధ్యపడవచ్చని 22 శాతం,ఏమీ చెప్పలేం అన్నది 15 శాతం అభిప్రాయం. 

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ, కాపు సామాజికవర్గానికి కీలక పాత్ర. ఈ రెండు సామాజికవర్గాలే ఎవరు అధికారంలో వుండాలి, ఎవరు ప్రతిపక్షంలో వుండాలనేది నిర్ణయిస్తాయి. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు దగ్గరవడానికి కాపు ఓట్లు కూడా ఓ కారణమన్నది అందరికీ తెలుసు. అలాంటిది ఎన్నికల వేళ కాపునేతలు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య వంటివారు పవన్ కు దూరమయ్యారు. వీరి ప్రభావం కాపులపై వుంటుందనే చర్చ జరుగుతోంది. కానీ వీరు కాపులను ప్రభావితం చేయలేరని అత్యధికంగా 49 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభావితం చేస్తారని మరో 36 శాతం, ఏమీ చెప్పలేమని 15 శాతం మంది తెలిపారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పాదయాత్ర పేరిట హడావుడి చేసారు వైఎస్ షర్మిల. తీరా ఎన్నికల సమయంలో పోటీనుండి తప్పుకుని కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. వెంటనే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయని... ఈసారి కూడా కాంగ్రెస్ ఓట్లు, సీట్లు సాధించలేదని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. కానీ 36 శాతం మంది మాత్రం షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ మెరుగైన  ప్రదర్శన చేస్తుందని అంటున్నారు.  18 శాతం మంది ఏమీ చెప్పలేని పరిస్థితి వుంది. 

మాజీ మంత్రి, వైఎస్ జగన్ కు సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్య వైఎస్ జగన్ కనుసన్నల్లోనే జరిగిందనే ప్రచారం వుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన తండ్రిని చంపారని... అతడిని తన అన్న వైఎస్ జగన్ కాపాడుతున్నాడని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు. తన తండ్రి హత్య విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటం చేస్తున్నారు సునీత. అంతేకాదు తనకు అన్యాయం చేస్తున్న జగనన్నకు ఈ ఎన్నికల్లో ఓటేయకూడదని కూడా సునీత ప్రజలను కోరారు.  కాబట్టి వివేకా మర్డర్, సునీత న్యాయపోరాటం ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించనుంది... 52 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు. 37 శాతం మంది మాత్రం ఎలాంటి ప్రభావం వుండదని అభిప్రాయపడ్డారు. 11 శాతం ఏం చెప్పలేకపోయారు. 

ఇక 2024 ఎన్నికలకు 'వై నాట్ 175' నినాదంతో వెళుతుంది జగన్ పార్టీ. అంటే గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసిపి ఈసారి 175 కు 175 సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. కానీ  ఇది అసాధ్యమని 66 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. కేవలం 23 శాతం మాత్రం సాధ్యపడొచ్చని అంటున్నారు. 

వైసిపి అధికారంలోకి వస్తూనే అమరావతి నుండి రాజధానికి మరో రెండు ప్రాంతాలకు తరలించాలనే నిర్ణయం తీసుకుంది. అంతకుముందే ఐదేళ్లు చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని చేపడితే వైసిపి వచ్చాక ఆ పనులు నిలిపివేసి విశాఖ నుండి పరిపాలన చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అలాగే కర్నూల్ ను న్యాయ రాజధానిగా ప్రకటించింది. ఇలా రాష్ట్రానికి అమరావతితో పాటు మరో రెండు రాజధానులు వుంటాయని ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని అత్యధికమంది ప్రజలు మాత్రం అంగీకరించడం లేదు. జగన్ సర్కార్ మూడురాజధానుల నిర్ణయం సరైంది కాదని 58 శాతం, సరైందేనని 36 శాతం, ఏమీ చెప్పలేమని 7 శాతం అభిప్రాయపడ్డారు. 

గత ఐదేళ్ల వైసిపి పాలనలో విజయవంతంగా సంక్షేమ పథకాలను అమలుచేసారని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. 6 శాతం మంది అభివృద్ది జరిగిందని, ఉద్యోగాలు కల్పించారని 2 శాతం మంది అభిప్రాయం. అసలు జగన్ సర్కార్ ఎందులో విజయవంతం అయ్యిందో చెప్పలేకపోతున్నామని 44 శాతం మంది అభిప్రాయపడ్డారు.  ఇక జగన్ మూడు రాజధానులు విషయంలో విఫలం అయ్యారని 31 శాతం అభిప్రాయపడ్డారు. అధిక అప్పులు కూడా జగన్ వైఫల్యమేనని మరో 31  శాతం, గంజాయి, డ్రగ్స్ నిర్మూలించలేకపోయాడని 9, శాంతిభద్రతలను కాపాడటంలో విఫలం అయ్యారన్నారు. ఉద్యోగాల కల్పనలో జగన్ సర్కార్ విఫలమయ్యిందని 21 శాతం అభిప్రాయం. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోవడంలో టిడిపి విఫలమైందని 27 శాతం, వైసిపి అని 29 శాతం అభిప్రాయపడ్డారు. అన్నిపార్టీలూ విఫలం అయ్యాయని 40 శాతం మంది అభిప్రాయపడ్డారు.

త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేన్ని చూసి ఓటేస్తారని కూడా ఏషియా నెట్ న్యూస్ తెలుగు ప్రజలను అడిగింది. అత్యధికంగా 72 శాతం మంది అభివృద్దిని చూసి ఓటేస్తామని, మరో 21 శాతం మంది సీఎం అభ్యర్థిని చూసి  ఓటేస్తామని తెలిపారు. ఉచిత పథకాలను చూసి 3శాతం, కులం 1 శాతం, ఉద్యోగ  కల్పన చూసి 4 శాతం మంది ఓటేస్తామని తెలిపారు.

 

click me!