
ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) కర్నూలు (kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జిల్లాలోని ఎగువ అహోబిలం (Ahobilam) రహదారిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం క్షేత్రానికి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. తిరిగి వచ్చే క్రమంలో వెనక్కి తిప్పుతుండగా అదుపుతప్పి లోయలో పడింది. స్థానికుల ద్వారా ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సును ఆళ్లగడ్డకు చెందినదిగా గుర్తించారు. ఘటన స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి రెండు అంబులెన్స్‌లలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని ఉప్పునూతల మండలం వెల్టూర్ గేట్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢికొన్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
Also read: West Bengal Accident: అంత్యక్రియలకు వెళుతుండగా ఘోర ప్రమాదం... 17మంది దుర్మరణం
శ్రీశైలం -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ప్రమాదానికి గురైన కార్లను అక్కడి నుంచి పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.