మాజీ మంత్రి నారాయణ కూతుళ్లు, అల్లుడికి ఊరట.. తొందరపాటు చర్యలు వద్దన్న హైకోర్టు

Published : May 16, 2022, 09:46 AM IST
మాజీ మంత్రి నారాయణ కూతుళ్లు, అల్లుడికి ఊరట.. తొందరపాటు చర్యలు వద్దన్న హైకోర్టు

సారాంశం

పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజ్ ఆరోపణలపై చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. వారికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.   

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసకుంది. పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజ్ ఆరోపణలపై చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె పునీత్‌ సహా మరికొందరు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషిన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లపై  ఈ నెల వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. 

వివరాలు.. నారాయణ కూతుళ్లు, అల్లుడితో పాటు విద్యాసంస్థలకు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ జాలిపర్తి కొండలరావు, మాలెంపాటి కిశోర్‌, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్‌ ప్రసాద్‌, వి.శ్రీనాథ్‌, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్‌, జి.సురేశ్‌కుమార్‌, ఎ.మునిశంకర్‌, బి.కోటేశ్వరరావు.. ముందస్తు బెయిల్ కోరుతూ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి తరఫున లాయర్లు గింజుపల్లి సుబ్బారావు, ఎస్ ప్రణతి, జి బసవేశ్వర పిటిషన్లు దాఖలు చేశారు. 

ఇక, విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో పలువురు నిందితులకు దిగువ కోర్టు బెయిలిచ్చిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్లకు మాల్ ప్రాక్టీస్‌తో సంబంధం లేదని.. వాస్తవానికి ఈ కేసులో పిటిషనర్లు నిందితులు కాదని అన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసేవారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. 

పోలీసుల తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. పిటిషనర్లను నిందితులుగా పేర్కొననప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ సందర్భంగా హైకోర్టు స్పందింస్తూ.. న్యాయస్థానం పిటిషనర్లు అసలు నిందితులే కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే నష్టం ఏమిటని ప్రశ్నించారు. పిటిషనర్లపై ఈ నెల 18 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

ఇక, పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు డీఈవో ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల చిత్తూరు పోలీసులు మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి చిత్తూరుకు తరలించారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా నారాయణ తరఫు లాయర్లు.. ఆయన 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవి నుంచి నుంచి తప్పుకున్నట్టుగా పత్రాలు చూపించారు. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే నారాయణకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం చిత్తూరు కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పి సుధాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశ్నపత్రాలు లీక్ కావడం చిన్న విషయం కాదని.. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ప్రోత్సహించరాదని సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం.. నారాయణకు నోటీసులు జారీ చేసింది. విచారణను మే 24కి వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu
YS Jagan Attends Wedding: నూతన వధూవరులను ఆశీర్వదించిన వై ఎస్ జగన్ | Asianet News Telugu